మెగాఫ్యాన్స్‌ను చల్లబర్చిన యండమూరి.. అప్పుడలా, ఇప్పుడిలా.. | Sakshi
Sakshi News home page

Yandamuri Veerendranath: అప్పట్లో చరణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇప్పుడేమో చిరును..

Published Sat, Jan 20 2024 1:09 PM

Yandamuri Veerendranath Praises Chiranjeevi In Award Function - Sakshi

స్వయంకృషితో ఎదిగిన హీరో.. అనగానే మొదట గుర్తొచ్చే పేరు చిరంజీవి. ఎన్నో కష్టాలు, కఠోర శ్రమ ఫలితంగా మెగాస్టార్‌ అన్న బిరుదు వచ్చింది. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న అతడు ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు పొంది తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే చిరంజీవికి ఎంతో సన్నిహితంగా మెదిలే స్టార్‌ రచయిత యండమూర వీరేంద్రనాథ్‌ గతంలో రామ్‌చరణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత యండమూరి వారి కోపాన్ని చల్లార్చాడు. అదెలాగంటే..

నెం.1 స్థానాన్ని నిలబెట్టుకోవడం కష్టం
ఎన్టీఆర్‌ 28వ వర్ధంతి, ఏఎన్నార్‌ శత జయంతి సందర్భంగా విశాఖపట్నంలో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి.. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ సాహిత్య పురస్కారాన్ని యండమూరి వీరేంద్రనాథ్‌కు అందజేశాడు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ.. 'నాకు, చిరంజీవికి విడదీయరాని అనుబంధం ఉంది. నేను రాసిన మూడో పుస్తకం ఆనందోబ్రహ్మ చిరంజీవికి అంకితం ఇచ్చాను. సినీ రంగంలో నెంబర్ వన్ అవడం కాదు నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. చిరంజీవి కష్టపడి నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నాకు ఇచ్చే ఈ అవార్డు నగదును రెండు స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తాను' అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో చరణ్‌ను అవమానించిన యండమూరి తాజాగా చిరును పొగడంతో ఫ్యాన్స్‌ కూల్‌ అవుతున్నారు.

చరణ్‌కు దవడ సరిగా లేదు
మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే ఇతడు 80, 90 దశకాల్లో చిరు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్‌ చిత్రాలకు రచయితగా పని చేశాడు. కానీ ఓ సందర్భంలో చిరు తనయుడిని కించపరిచేలా మాట్లాడాడు. 2016లో ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ ఫంక్షన్‌లో యండమూరి మాట్లాడుతూ..  చరణ్‌ను హీరో చేయడం అతడి తల్లి సురేఖ చాలా కష్టపడింది. డ్యాన్సులు నేర్పించింది. అప్పట్లో ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదు, తర్వాత దాన్ని సరి చేయించారు. అదే సమయంలో మరో ఎనిమిదేళ్ల కుర్రాడు ఎంతో ప్రతిభ కనబర్చాడు.

చరణ్‌ పేరు చెప్తే చప్పట్లు కొట్టలేదు
అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట విని ఇది శివరంజనీ రాగం అని గుర్తుపట్టాడు. దీంతో ఇళయరాజా ఆ కుర్రాడిని మెచ్చుకున్నాడు. అతడే దేవిశ్రీప్రసాద్‌..' అని చెప్పుకుంటూ పోయాడు. అక్కడితో ఆగకుండా 'రామ్‌చరణ్‌ పేరు చెప్పినప్పుడు మీరు చప్పట్లు కొట్టలేదు. కానీ దేవిశ్రీప్రసాద్‌ పేరు చెప్పినప్పుడు మాత్రం చప్పట్లు కొట్టారు. ఎందుకంటే డీఎస్పీ స్వశక్తితో పైకొచ్చాడు. నువ్వు ఏంటనేది ముఖ్యం అంతే తప్ప మీ నాన్న ఎవరన్నది కాదు' అని వ్యాఖ్యానించాడు. ఓసారి పవన్‌ కల్యాణ్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మెగా ఫ్యాన్స్‌ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
Advertisement
 
Advertisement