ఆ బాధ నాకే ఎక్కువ తెలుసు..: విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda about Jana Nayagan Movie Leak | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: ఆ బాధ నేనూ అనుభవించా.. అందుకే కోపంగా ఉంది!

Apr 11 2026 12:32 PM | Updated on Apr 11 2026 12:53 PM

Vijay Devarakonda about Jana Nayagan Movie Leak

ఒక సినిమా రూపుదిద్దుకోవడం వెనక వందలాది మంది కష్టం దాగి ఉంటుంది. ఆ మూవీ రిలీజై ఆదరణ పొందినప్పుడు వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కినట్లు లెక్క! కానీ రిలీజ్‌కు ముందే పైరసీ బారిన పడితే వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ పైరసీ అతిపెద్ద భూతంగా మారింది. తాజాగా విజయ్‌ చివరి మూవీ జననాయగణ్‌ సినిమాకు లీకుల బెడద తప్పలేదు.

జననాయగణ్‌ లీక్‌
థియేటర్లలో విడుదలవడానికి ముందే ఈ చిత్రంలో అనేక సన్నివేశాలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారు. దీనిపై చిత్రనిర్మాణ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరైనా ఆ పైరసీ వీడియోలు చూసినా, షేర్‌ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామంది. ఇక ఎంతోమంది సెలబ్రిటీలు జన నాయగణ్‌కు జరిగిన అన్యాయంపై సోషల్‌ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.

ఆ బాధ అనుభవించా..
తాజాగా హీరో విజయ్‌ దేవరకొండ సైతం ఈ విషయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'జననాయగణ్‌ సినిమా లీక్‌ అయిందన్న విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సినిమా లీకైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.. కెరీర్‌ తొలినాళ్లలోనే ఆ బాధను, నష్టాన్ని చవిచూశాను. మనల్ని టార్గెట్‌ చేయడంతో మన ఆశలన్నీ అడియాసలైపోతాయి. నేను కేవలం నా గురించి మాత్రమే చెప్పడం లేదు. నటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా సినిమాలో భాగమైన ఎంతోమందికి ఇదే వర్తిస్తుంది.

ఎంత దిగజారుతున్నారు?
ప్రస్తుత సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. అలాగే దీని వెనక ఉన్న వ్యక్తులను గుర్తించాలి. అది గనక చేయలేకపోతే అది వ్యవస్థ వైఫల్యమే అవుతుంది. అవతలివారికి హాని చేయడానికి మనుషులు ఎంత దిగజారుతున్నారు? అనేదానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం. ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న జననాయగణ్‌ మూవీ టీమ్‌కు నా సపోర్ట్‌ ఎల్లప్పుడూ ఉంటుంది' అని ట్వీట్‌ చేశాడు.

టాక్సీవాలా
కాగా విజయ్‌ దేవరకొండ కెరీర్‌ తొలినాళ్లలో టాక్సీవాలా సినిమా చేశాడు. ఈ మూవీ కూడా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉండగానే లీక్‌ అయింది. అది చూసి విజయ్‌ మానసిక క్షోభ అనుభవించాడు. తన పనైపోయిందని గదిలో కూర్చుని ఏడ్చాడు. ఏదైతే అదైందని, సినిమా రిలీజ్‌ చేద్దామని పట్టుబట్టాడు. అలా పైరసీ జరిగిన సినిమాను థియేటర్లలో విడుదల చేసి మరీ హిట్టు కొట్టాడు.

 

 

చదవండి: డెకాయిట్‌కు ఊహించని కలెక్షన్స్‌.. తొలిరోజు ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement