Allu Arjun Rapido Ad: తక్షణమే ఆర్టీసీకి అల్లు అర్జున్‌ క్షమాపణలు చెప్పాలి

TSRTC MD Sajjanar Warns Allu Arjun And Rapido Over Commercial AD - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ర్యాపిడో ప్రకటన సంచలనమైంది. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సదరు వాణిజ్య ప్రకనట ఉందని ఆర్టీసీ ఏండీ సజ్జనార్‌ నిన్న అల్లు అర్జున్‌తో పాటు ర్యాపిడో సంస్థకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సజ్జనార్‌ దీనిపై మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌, ర్యాపిడో సంస్థ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

చదవండి: అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్‌, లీగల్‌ నోటీసులు జారీ

అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తాము ఇచ్చిన నోటిసులకు సమాధానం రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని ఆయన చెప్పారు. సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని ఈ సందర్భంగా సజ్జనార్‌ సూచించారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు.

చదవండి: హీరోయిన్‌ పూర్ణతో రవిబాబు ఎఫైర్‌ అంటూ వార్తలు, స్పందించిన నటుడు

ఇలాంటి విషయాల్లో సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. ఎవరైనా తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్‌లను కించపరచకూడదనే విషయాన్ని గుర్తించాలని సజ్జనార్ తెలియజేశారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంటుందని, తన బాల్యం, విద్యార్థి దశ, కాలేజీ జీవితం మొత్తం ఆర్టీసీతోనే ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్టను పెంచుతామని, నష్టాల నుంచి లాభాల వైపు వచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top