
తన పేరులోనే రాశిని పొందుపరచుకున్న నటి రాశిఖన్నా. హీరోయిన్‌గానూ తన రాశి బాగానే ఉంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన భామ తమిళంలో ఇమైకా నొడికల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రంలో అధర్వ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నటి రాశిఖన్నా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
రాశి ఖన్నా చివరిగా ధనుశ్, నిత్యామీనన్ జంటగా నటించిన తిరుచిత్రంబలం చిత్రంలో కీలకపాత్రను పోషించారు. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయినా ప్రస్తుతం రాశి ఖన్నా వరుసగా చిత్రాలు చేయడం లేదు. ఆమెకు అవకాశాలు రాకపోవడం లేక ఇతర భాషల్లో నటించడంతో సమయం సరిపోవడం లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు అవసరమైతే అందాల ఆరబోతకు సై అంటున్నారు. అదేవిధంగా కోలీవుడ్‌లో మంచి చిత్రాల్లో నటించాలన్న కోరికను ఈ బ్యూటీ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఈవెంట్‌లో పాల్గొన్న రాశిఖన్నా తన భావాలను వ్యక్తం చేస్తూ అభిమానులు ఇష్టపడే కథానాయకగా సినిమాల్లో కొనసాగడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇంకా తన జీవితంలో పెద్ద కల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు రాశిఖన్నా తెలిపారు