అనన్య నాగళ్ల హీరోయిన్‌గా వస్తోన్న మూవీ "లీసా". సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ హైదరాబాద్‌లో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ..' నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేది చూసుకుంటా. డిఫరెంట్‌గా ఉంటేనే ఆ మూవీని ఒప్పుకుంటా. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ నేను ఎప్పుడూ చేయలేదనిపించింది. ఈ సినిమాలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. లీసా మూవీలో నటిస్తున్నప్పుడు నటిగా కొత్తదనాన్ని ఫీలయ్యా. హీరోయిన్స్‌గా మాకు అరుదుగా ఇలాంటి చిత్రాలు దక్కుతుంటాయి. డైరెక్టర్ జవహర్ లాల్ రాజు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా షూట్ చేసేవారు. సతీష్ రెడ్డి బ్యూటిపుల్ విజువల్స్ అందించారు. లీసా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది' అని అన్నారు.
దర్శకుడు జవహర్ లాల్ రాజు మాట్లాడుతూ..' లీసా సినిమాలో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మేకింగ్ చూస్తారు.ఈ సినిమా చూస్తూ షాక్ అవుతారు. ఈ సినిమాకు సతీష్ రెడ్డి అన్న బ్యాక్ బోన్‌లా నిలిచారు. మా ప్రొడ్యూసర్స్‌కు సినిమా మేకింగ్ మీద మంచి ప్యాషన్ ఉంది. అనన్య ఫర్మామెన్స్ మీ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమా మేకింగ్ క్రమంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, దశరథ్, కిషోర్ దాస్, రవిరెడ్డి , సత్యశ్రీ, మాసం రత్నాకర్ రెడ్డి, హను శ్రీ, గీత, భాను కీలక పాత్రల్లో నటించారు.


