
'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించాడు హీరో తేజ సజ్జా (Teja Sajja). ఇతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్ (Mirai Movie). మంచు మనోజ్, శ్రియ, జగపతిబాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న విడుదల కానుంది.
వారికోసమే ఈ నిర్ణయం
తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, మరాఠి, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సోమవారం నాడు మిరాయ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై టికెట్ రేట్ల పెంపు గురించి హీరో క్లారిటీ ఇచ్చాడు. తేజ సజ్జా మాట్లాడుతూ.. టికెట్ రేట్ల పెంపు లేదు. తక్కువ ధరకే ఈ సినిమాను చూడబోతున్నారు. మా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ను ఇబ్బంది పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. కుటుంబమంతా వచ్చి చూడాలనే టికెట్ రేట్లు పెంచడం లేదు అని తేజ సజ్జ పేర్కొన్నాడు.
టికెట్ రేట్లు యథాతథం
అయితే ఓ రెండు సర్‌ప్రైజ్‌లు దాచుంచామని, అది ఎవరికీ తెలియదని, తెలుసుకోవాలంటే థియేటర్‌కు రమ్మని పిలుపునిచ్చాడు. ఈరోజుల్లో మధ్య తరహా, భారీ బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచేస్తున్నాయి. అలాంటి తరుణంలో టికెట్ రేట్లు పెంచకుండా సినిమా తీసుకొస్తుండటంతో పలువురూ మిరాయ్ టీమ్‌ను అభినందిస్తున్నారు.
కథేంటంటే?
మహాజ్ఞాన సంపన్నుడు అశోక చక్రవర్తి తాను పొందిన జ్ఞానాన్ని గ్రంథంలో పొందుపరిచారు. అది ఒకే చోట ఉంటే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని భావించి దాన్ని 9 గ్రంథాలుగా విభజించి 9 మంది యోధులకు ఇస్తారు. ఆ గ్రంథాలను పరిరక్షించే బాధ్యతను అప్పజెప్పుతారు. అయితే, 2025లో ఒక ఈవిల్ ఫోర్స్ వాటిని ఒక్కొక్కటిగా తస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి వాటిని హీరో కాపాడాడా? లేదా? అన్నదే సినిమా కథ! ఈ మూవీని చైనా, జపాన్‌లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.