కంగన రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు

Team Kangana Ranaut Says If She Found Hanging Dont Think Its Suicide - Sakshi

ముంబై: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడిని టార్గెట్‌ చేశారు. ‘‘బేబీ పెంగ్విన్‌’’ అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో కంగన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఆత్మహత్య చేసుకునే ముందు రోజు రాత్రి సుశాంత్‌ ఇంట్లో పార్టీ జరిగిందని, ఇందులో ఓ ప్రముఖ వ్యక్తి పాల్గొన్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ మేరకు.. ‘‘ప్రతీ ఒక్కరికి ఈ విషయం తెలుసు. కానీ ఎవరూ తన పేరు చెప్పరు. కరణ్‌ జోహార్‌ ప్రాణ స్నేహితుడు, ప్రపంచంలోనే గొప్ప ముఖ్యమంత్రి యొక్క గొప్ప కొడుకు. ఆయనను ప్రేమగా బేబీ పెంగ్విన్‌ అని పిలుస్తారు. ఒకవేళ నేను నా ఇంట్లో ఉరివేసుకుని కనిపిస్తే, దయచేసి నేను ఆత్మహత్య చేసుకున్నానని మాత్రం అనుకోకండి అని కంగనా చెబుతోంది’’అని టీం కంగనా రనౌత్‌ తన ట్విటర్‌ ఖాతాలో రాసుకొచ్చింది.(జూన్‌ 8 వరకు సుశాంత్‌తోనే ఉన్నా: రియా)    

ఈ క్రమంలో.. ‘‘మీరు ధైర్యవంతురాలు మేడం. అందుకే ఆ వ్యక్తి పేరును ప్రస్తావించారు. సుశాంత్‌కు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం ఆగదు’’అంటూ సుశాంత్‌ ఫ్యాన్స్‌ కంగనాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా అభిమానులు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించలేమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు, మంత్రి ఆదిత్య ఠాక్రేను టార్గెట్‌ చేస్తూ కంగన చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. (ఆమె విషకన్య.. సంచలన ఆరోపణలు)

ఇక ఇటీవల ఆదిత్య ఠాక్రేను ఓ నెటిజన్‌ బేబీ పెంగ్విన్‌ అని సంబోధించడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆయన డ్రీం ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన, ముంబై జూలో పెంగ్విన్‌ల పెంపకం కోసం ప్రభుత్వం దాదాపు రెండున్నర కోట్లు ఖర్చు చేసిందన్న వార్తల నేపథ్యంలో సమీర్‌ థక్కర్‌ అనే వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత ఖర్చు పెట్టి కృత్రిమ వాతావరణం సృష్టించినప్పటికీ లాభం లేకుండా పోయిందని.. అనవసరంగా ఓ పెంగ్విన్‌ మరణానికి కారణమయ్యారంటూ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో బేబీపెంగ్విన్‌ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శివసేనలో అంతర్భాగమైన యువసేన లీగల్‌ హెడ్‌ సదరు వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ చట్టం, పరువు నష్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top