Actress Archana: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ బుల్లితెర నటి

Tamil Serial Actress Archana To Debut Into Movies - Sakshi

మరో బుల్లితెర నటికి కథానాయకి అదృష్టం వరించింది. టీవీ యాంకర్లు, సీరియల్‌ హీరో హీరోయిన్లు కావడం కొత్తేమి కాదు. ఇప్పుడు ప్రముఖ నటీనటులుగా రాణిస్తున్న శివ కార్తికేయన్, నటి ప్రియా భవాని శంకర్, వాణి భోజన్‌ వంటి వారు మొదట ప్లాట్‌ఫామ్‌ బుల్లితెరనే. అలా బుల్లితెరపై అనతి కాలంలోనే తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి అర్చన. 2019లో ఆదిత్య చానల్‌లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తరువాత రాజా రాణి–2 సీరియల్‌ ద్వారా నటిగా పరిచయమయ్యారు.

ఆ సీరియల్‌లో నటిగా తన సత్తా చాటుకుని మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత లవ్‌ ఇన్సూరెన్స్, ట్రూత్‌ ఆర్‌ డేర్‌ అనే షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించారు. ఆ తరువాత కల్యాణం వయసు వందురుచ్చి అనే వెబ్‌సిరీస్‌లో నటించి గుర్తింపు పొందారు. ఇటీవల సోనీ మ్యూజిక్‌ సంస్థ ధరన్‌కుమార్‌ సంగీతంలో రూపొందించిన తామా తుండు అనే వీడియో ఆల్బమ్‌లో అర్చన నటించారు.

ఈ వీడియో వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందని అర్చన పేర్కొన్నారు. దీంతో సినిమా అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అరుల్‌నిధికి చెల్లెలుగా డీమాంటి కాలనీ –2 చిత్రంలో నటించే అవకాశం ఈ బ్యూటీని వరించింది. దీని గురించి అర్చన మాట్లాడుతూ.. తాను అచ్చ తమిళ అమ్మాయినని చెప్పారు. అందుకే దర్శకులు చెప్పే విషయాలను సులభంగా అర్థం చేసుకుని నటిస్తానని అన్నారు. మంచి నటిగా రాణించాలన్నదే తన కోరిక అన్నారు. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం తదితర భాషల్లోనూ మంచి గుర్తింపును తెచ్చుకుని ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top