 
													టాలీవుడ్ సినిమాకు ఉన్న క్రేజే వేరు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ వరల్డ్ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఇప్పటికే రాజమౌళి బాహుహలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఆస్కార్ వేదికపై తెలుగోడి సత్తా చాటాడు. అందుకే మన తెలుగు సినిమాలంటే ఫారినర్స్ కూడా పడి చచ్చిపోతారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే పుష్ప మేనరిజంతో అలరిస్తాడు. తెలుగు సినిమాపై ఉన్న ఇష్టంతో నితిన్ రాబిన్‌హుడ్ మూవీలో కెమియో పాత్రలో సందడి చేశాడు.
అంతలా తెలుగు సినిమాలకు ఫారినర్స్ ఫిదా అవుతున్నారు. డేవిడ్ వార్నర్ లాగే ఎప్పటి నుంచో స్వీడన్కు చెందిన కర్ల్ స్వాన్‌బెర్గ్ దంపతులు మన చిత్రాలకు డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటారు. కొత్త సినిమాలో ఏ హిట్ సాంగ్ వచ్చినా వీరిద్దరు కలిసి రీల్ చేయాల్సిందే. అలా ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టు సాంగ్ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. అంతేకాకుండా పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు తమదైన స్టెప్పులతో అదరగొట్టేశారు.
తాజాగా మరో టాలీవుడ్ సాంగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా అంటూ సాగే పాటతో అలరించారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం మూవీలో ఈ సాంగ్కు డ్యాన్స్ చేశారు. ఇటీవల రిలీజైన కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్ స్టైల్లో అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. కర్ల్ స్వాన్‌బెర్గ్ తన భార్యతో కలిసి చేసిన డ్యాన్స్ తెలుగు ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్.. మీరిద్దరు హైదరాబాద్కు వచ్చేయండి బ్రో.. ఆధార్ కార్డ్స్ ఇప్పిస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మా ఇండియన్స్ కంటే మీ వీడియోలే బాగుంటాయని మరికొందరు కొనియాడుతున్నారు. మీ ఇద్దరికి ఆధార్, పాన్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత నాది అంటూ మరో నెటిజన్స్ భరోసానిస్తూ కామెంట్ చేశాడు. ఏది ఏమైనా మన తెలుగు సినిమాకు విదేశీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
