
మలయాళ ప్రముఖ నటులు, త్రిశ్శూర్ ఎంపీ, కేంద్రమంత్రి సురేష్ గోపీని సాయం చేయాలని కొద్దిరోజుల క్రితం ఓ వృద్ధుడు కోరాడు. అయితే, దానిని ఆయన తిరస్కరించారు. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఆపై అక్కడి రాజకీయ ప్రత్యర్దులు కూడా ఆయనపై విరుచుకపడ్డారు. ఈ అంశంపై తాజాగా కేంద్రమంత్రి సురేష్ గోపీ రియాక్ట్ అయ్యారు.
ఇటీవల కేరళలో జరిగిన ఓ ర్యాలీలో సురేశ్ గోపీ పాల్గొన్నారు. ఆ సమయంలో ఇల్లు కట్టుకోవడానికి సహాయం కోరుతూ ఒక వృద్ధుడు ఇచ్చిన దరఖాస్తును ఆయన స్వీకరించలేదు. అందుకు సంబంధించి సురేష్ గోపీ ఇలా వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు రాజకీయ ఎజెండాగా ఉపయోగిస్తున్నారని ఆయన తప్పుబట్టారు.
'ఒక ప్రజా సేవకుడిగా, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. నిలబెట్టుకోలేని వాగ్దానాలు నేను చేయలేను. గృహ నిర్మాణం అనేది రాష్ట్ర సమస్య. కాబట్టి, అలాంటి అభ్యర్థనలను నేను ఒక్కడినే మంజూరుచేయలేను. రాష్ట్ర ప్రభుత్వమే దాని గురించి ఆలోచించాలి. ఈ సంఘటన ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇంటిని మంజూరు చేసింది.
ఈ విషయం తెలిసిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. ఇది రాజకీయంగా ప్రేరేపించబడినప్పటికీ, నా వల్ల అతనికి మంచి జరిగింది. గత రెండు సంవత్సరాలుగా ప్రజలు దీనిని గమనిస్తున్నారు.నా వల్ల ఇల్లు అందించడానికి వారు ముందుకు వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా ప్రయత్నాలు ఎల్లప్పుడూ వ్యవస్థలో పనిచేయడం, ప్రజలకు నిజమైన ప్రయోజనాలను అందించడంపైనే ఉంటాయి.' అని ఆయన అన్నారు.