వెండి వెలుగులకై దక్షిణాది పోటాపోటీ! | South Indian cinema industry special Focus On shootings and infrastructure | Sakshi
Sakshi News home page

South Indian cinema: వెండి వెలుగులకై దక్షిణాది పోటాపోటీ!

Dec 17 2025 7:21 PM | Updated on Dec 17 2025 8:56 PM

South Indian cinema industry special Focus On shootings and infrastructure

దేశంలో వేల కోట్ల రూపాయల పరిశ్రమగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఎ.వి.జి.సి) విజృంభణతో విస్తృతమైన వినోద రంగంలో సినిమా ఓ చిరుభాగమైంది. ఇవాళ మారిన కాలంతో పాటు మారాల్సి వస్తున్న సినిమా ఒకపక్క భాష, ప్రాంతీయ భేదాలను చెరిపేస్తుంటే, మరోపక్క ఓటీటీ వేదికలు దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సొంతంగా నిర్మిస్తున్న ‘ఒరిజినల్స్’ కొత్త తరహా కథ, కథనాలను పరిచయం చేస్తున్నాయి. ఫిల్మ్ సిటీల నిర్మాణం మొదలు శిక్షణ, మెంటర్ షిప్‌ల ద్వారా ఈ సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ’లో ముందుగా పై చేయి సాధించాలని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీ పడుతున్నాయి.

సాధారణ ఆర్థిక రంగంలోనే కాదు... సృజనాత్మక ఆర్థికవ్యవస్థ (క్రియేటివ్ ఎకానమీ)లోనూ తమదైన ముద్ర వేసేందుకు దక్షిణాది రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు దూసుకు వస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకపక్క హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్’ పేరిట డిసెంబర్ 8 – 9 తేదీలలో గ్లోబల్ సమిట్ జరిగి, అందులో భాగంగా హిందీ సినీ పరిశ్రమను సైతం తెలంగాణకు ఆకర్షించాలన్న ప్రయత్నం జరిగింది. సరిగ్గా అదే సమయంలో డిసెంబర్ 9న చెన్నైలో ప్రముఖ ‘జియో – హాట్‌స్టార్’ సంస్థ నాలుగు దక్షిణాది భాషల్లో సరికొత్త వెబ్ సిరీస్‌లు, షోలను జనం ముందుకు తెస్తూ, అందుకు ముందస్తుగా ‘సౌత్ అన్‌బౌండ్’ అనే ఉత్సవం నిర్వహించింది. అక్కడే తమిళనాట సినీ పరిశ్రమ అభివృద్ధికి గాను ఆ సంస్థకూ, తమిళనాడు ప్రభుత్వానికీ మధ్య ఓ ప్రాథమిక అవగాహన కూడా కుదరడం విశేషం.

మరోపక్క తెలుగు రాష్ట్రాలు ఒకటికి రెండు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సైతం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కొన్నేళ్ళుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగులకు  సింగిల్ విండో అనుమతుల మొదలు పలు చర్యలు గతంలోనే పాలకులు చేపట్టారు. స్థానికంగా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్లను ప్రోత్సహించి, ఇప్పటికిప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో పరిశ్రమకు మరో కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలనేది ప్రయత్నం. వెరసి, సినీ పరిశ్రమకు చెరగని చిరునామాగా నిలిచి, తద్వారా ‘క్రియేటివ్ ఎకానమీ’లో ముందు వరుసలో నిలవాలని దక్షిణాది రాష్ట్రాలు పరస్పరం పోటీ పడుతుండడం గమనార్హం.

సినిమాకు ‘ఫ్యూచర్ సిటీ’... వినోదానికి గ్లోబల్ హబ్…

తెలుగు సినీ పరిశ్రమకు ఆది నుంచి తమ కాంగ్రెస్ ప్రభుత్వాలే అండగా నిలుస్తున్నాయని పదే పదే నొక్కిచెబుతున్న ప్రస్తుత తెలంగాణ సర్కార్ హైదరాబాద్‌ను భారతీయ సినిమా పరిశ్రమకు మరో కీలక కేంద్రంగా రూపుదిద్దడానికి చాలాకాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా రానున్న ‘ఫ్యూచర్ సిటీ’లో సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్ గణ్ లాంటి హిందీ తారలకు సైతం ఫిల్మ్ సిటీ నిర్మాణాలకు స్థలాలు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. దాదాపు 50 ఏళ్ళుగా హైదరాబాద్‌తో మమేకమైన అన్నపూర్ణ స్టూడియోస్ సైతం ‘ఫ్యూచర్ సిటీ’లో భాగమవుతుందంటూ అక్కినేని నాగార్జున లాంటి వారు ప్రకటించారు.


అలాగే, సంస్కృతి, సినిమా, సృజనాత్మకతలకు గ్లోబల్ హబ్‌గా రాష్ట్రాన్ని నిలపడం కోసం ఈ డిసెంబర్ ప్రథమార్ధంలోనే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐ.ఐ.ఎఫ్.ఎ – ‘ఐఫా’)తో సైతం తెలంగాణ సర్కార్ పలు సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు 120కి పైగా దేశాల్లో వీక్షకులున్న “వార్షిక ‘ఐఫా’ ఉత్సవం 2026 నుంచి 2028 వరకు వరుసగా మూడేళ్ళ పాటు హైదరాబాద్‌లో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు ‘ఐఫా’ అవార్డులు అందించే ఈ ఉత్సవాల వల్ల ఏటా కొన్ని వేల మంది సందర్శకులు మన దగ్గరకు వస్తారు” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.  

దక్షిణాదిపై కన్నేసిన ‘జియో- హాట్‌స్టార్’!

ఇక, తమిళనాడు ప్రభుత్వంతో తాజాగా ‘జియో-హాట్‌స్టార్’ భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు అక్కడి ప్రభుత్వంతో ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్‌’పై సంతకం చేస్తున్నట్లు డిసెంబర్ రెండోవారంలో ప్రకటించింది. ఫలితంగా, తమిళనాట సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ‘జియో-హాట్‌స్టార్’ కీలక పాత్ర పోషించనుంది. “ప్రాంతీయతకు పెద్ద పీట వేసి, కొత్త తరం కథలు, భౌగోళిక సరిహద్దులను దాటి వినూత్న కథలను భారీ స్థాయిలో పరిచయం చేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశం. అందుకు తగ్గట్టే నవతరం చిత్రనిర్మాతలు, రచయితలు, ఎడిటర్‌లు, డిజిటల్ కథకులను ప్రోత్సహించే విధంగా రైటింగ్ ల్యాబ్‌లు, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లు, నైపుణ్యాభివృద్ధి వర్క్ షాప్‌ల లాంటివి చేపడతాం” అని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.  

ఇప్పటికే, నెట్‌ఫిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటివి దక్షిణాదిలోనూ అనేక రకాల ఒరిజినల్ కంటెంట్‌తో ముందుకొస్తున్నాయి. తాజాగా ‘జియో – హాట్ స్టార్’ సైతం ఏకకాలంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం... ఇలా నాలుగు దక్షిణాది భాషల్లో ఫిక్షన్, నాన్ – ఫిక్షన్ కేటగిరీలలో 25 రకాల కొత్త టైటిల్స్‌ను వీక్షకుల నెట్టింట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. “దక్షిణ భారతదేశం ఎప్పుడూ సృజనాత్మకశక్తికి కేంద్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి ప్రేక్షకులు వినోద రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. వారి అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త వినోదం అందించాలన్నది మా ప్రయత్నం. అందుకే ఈ ‘సౌత్ అన్ బౌండ్’. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కొత్తగా 25 వెబ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు అందిస్తున్నాం. ఈ కృషిలో భాగంగా గత పది నెలల్లో, దాదాపు 500 మందికి క్రియేటర్లు, డైరెక్టర్లు, షో రన్నర్లు మా సంస్థ కుటుంబంలో భాగమయ్యారు” అని ‘జియో స్టార్’ ఎంటర్‌టైన్‌మెంట్ (సౌత్) హెడ్ కృష్ణన్ కుట్టి వివరించారు.


దక్షిణాది సినీ ప్రముఖులు ఎందరో...

  ఈ ప్రసిద్ధ స్ట్రీమింగ్ దిగ్గజం అందిస్తున్న సిరీస్‌లు, షోలలో సినీ ప్రముఖులు సైతం భాగం కావడం చెప్పుకోదగ్గ విశేషం. తమిళంలో విజయ్ సేతుపతి సైతం ‘కాట్టాన్’ అనే ఓ వెబ్ సినిమాను స్వయంగా నిర్మిస్తూ, నటిస్తుంటే, మలయాళంలో ‘దృశ్యం’ చిత్ర సిరీస్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొందిన దర్శక – నిర్మాత జీతూ జోసెఫ్ సైతం మరో ఓటీటీ ప్రయత్నాన్ని సమర్పిస్తున్నారు. ఇక, ప్రసిద్ధ నటుడు నివిన్ పాలీ సైతం భారతీయ ఔషధ రంగంలోని లోటుపాట్లపై నిర్మిస్తున్న ‘ఫార్మా’ అనే వెబ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో ప్రముఖ సినీ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ఐశ్వర్యా రాజేశ్, సీనియర్ నటి జయసుధ, యువ హీరో ప్రియదర్శి, యువ హీరోయిన్ శివాత్మికా రాజశేఖర్, కమెడియన్ అభినవ్ గోమఠం, సీనియర్ నటుడు సాయికుమార్... ఇలా సుపరిచితులైన పలువురు ఈ వెబ్ షోలలో అలరించనున్నారు.


ఇలా రాబోయే అయిదేళ్ళలో ఆ సంస్థ దక్షిణాది భాషల్లో ఏకంగా రూ. 12 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. స్వయంగా పలు చిత్రాలు నిర్మించి, వెండితెరపై నటించిన తమిళనాడు ఉప-ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సైతం రాష్ట్రంలో మరింత ఉపాధి, ఆదాయం పెంచే ఈ ఆలోచన పట్ల ఉత్సాహం కనబరుస్తున్నారు. “దక్షిణాది రాష్ట్రాలకు చెన్నై ఓ ప్రధాన కేంద్రం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు ఇక్కడే పుట్టాయి. అన్ని భాషల కళాకారులకూ ఇది నిలయం. దక్షిణాది సహకారం భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను సృష్టించింది” అని ఆయన వ్యాఖ్యానించారు.


 దక్షిణాదిలో రానున్న సరికొత్త ఫిల్మ్ సిటీలు!
    
    నిజానికి, సినీ రంగంలోకి రావాలనుకొనే ఔత్సాహికులకు శిక్షణ నిచ్చేందుకు 1970ల నాటికే చెన్నైలో సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ పక్షాన ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఆరంభమైంది. ఆ తరువాత కాలంలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతూ వచ్చింది. ఇప్పటికీ అది నడుస్తోంది. ఇక, 1990ల నాటికే చెన్నైలో ఒకే చోట పలు సినిమా, టీవీ సీరియళ్ళ నిర్మాణానికి అనువుగా ఉండేలా ప్రభుత్వం ‘ఎం.జి.ఆర్. ఫిల్మ్ సిటీ’ పేరిట ప్రత్యేకంగా నెలకొల్పింది. అది చాలాకాలం తమిళ, తెలుగు, మలయాళ సినిమాలకు నిర్మాణ కేంద్రంగా నడిచింది. ఇప్పుడు హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’లో సినిమా స్టూడియోలు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో స్టూడియోల నిర్మాణం కోసం ప్రయత్నాలు సాగుతుంటే... మరోపక్క చెన్నైలో ఇప్పటికి రెండేళ్ళుగా సమస్త సౌకర్యాలతో, అధునాతన ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

2024 జనవరిలోనే డి.ఎం.కె. అధినేత – తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శతజయంతి సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్రణాళికను ప్రకటించారు. చెన్నై శివార్లలోని పూనమల్లి దగ్గర కుతంబాక్కమ్ ప్రాంతంలో 152 ఎకరాల స్థలంలో రూ. 500 కోట్లతో ఈ నవీన ఫిల్మ్ సిటీ రూపొందనుంది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో పాటు భారీ ఎల్ఈడీ గోడలతో కూడిన వర్చ్యువల్ ప్రొడక్షన్ టెక్నాలజీలు, పోస్ట్ ప్రొడక్షన్ వసతులు, పరిశ్రమ వర్గీయుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ వసతి వగైరా అంతా అందుబాటులో ఉంచాలని యోచన. “త్వరలోనే నిర్మాణం చేపట్టి, సరికొత్త ఫిల్మ్ సిటీ కల సాకారం చేస్తాం” అని ఉదయనిధి ప్రకటించారు.


 నేరుగా ఇంట్లోనే రిలీజ్!

ఇప్పుడు ఓటీటీలు కూడా రావడంతో అవి ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఒరిజినల్ వెబ్ సినిమాలు, సిరీస్‌లు, షోల చిత్రీకరణ కూడా హెచ్చింది. భాషలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అందరినీ అలరించడమూ పెరిగింది. దక్షిణాది మీద ఇటీవల ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న ఈ ఓటీటీ వేదికల ప్రాజెక్టులకు సైతం వసతి సౌకర్యాలు పెరగాల్సి ఉంది. అందుకోసం రానున్న కొత్త ఫిల్మ్ సిటీ వసతులు, రాష్ట్రాల ప్రత్యేక పాలసీలు ఉపకరిస్తాయి. ఆ సంగతి గ్రహించబట్టే దక్షిణాది రాష్ట్రాలన్నీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.


థియేటర్లతో సంబంధం లేకుండా నేరుగా నట్టింటికే సినిమాను తీసుకొచ్చేసిన ఓటీటీలు ఇటీవల సులభమైన డబ్బింగ్, సబ్ టైటిల్స్ సాయంతో భాష, భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేశాయి. “కథలు చెప్పే విషయంలో కంటెంట్ ముఖ్యం. ఇప్పుడైనా, ఎప్పుడైనా కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ బాగుంటే చాలు, భాష, ప్రాంతం దాటి అన్ని భాషల వారిని అలరిస్తాయి” అని అభిమానులు ఆప్యాయంగా ‘కింగ్’ అని పిలుచుకొనే హీరో నాగార్జున సైతం ఇటీవల బాహాటంగా అన్నారు. ఉదయనిధి సైతం ఆ మాటే అంటూ, “కథను ఎలా చెప్పాలి, ప్రజలకు ఎలా చేరువ చేయాలి అన్న దానికి కమలహాసన్ సార్ గొప్ప స్ఫూర్తి, ఉదాహరణ. సినీరంగంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఓటీటీలు ఏవీ రాక ముందే, పుష్కరకాలం క్రితమే 2013 లోనే ఆయన తన (‘విశ్వరూపమ్’) చిత్రాన్ని డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) రిలీజ్ చేశారు” అని గుర్తు చేశారు.

కరోనా కాలంలో థియేటర్లు మూసివేతలో ఉండడంతో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేయడం తెలిసిందే. ఇక, ఇప్పుడు తమదైన ప్రత్యేకత చాటాలని ‘జియో-హాట్ స్టార్’, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ స్ట్రీమింగ్ వేదికలు తమ ఒరిజినల్స్ ద్వారా చేస్తున్నది అదే. అవి నేరుగా వీక్షకుడి నట్టింటిలోకే తమ కొత్త సినిమా, సిరీస్, షోలను అందిస్తున్నాయి. వినోద రంగంలో విప్లవం సృష్టిస్తున్నాయి. థియేటర్లలో రిలీజయ్యే కొత్త సినిమాకు సైతం పోటీ అవుతున్నాయి. అయితే, ఓటీటీ కొత్త ద్వారాలు తెరిచింది. ఉదయనిధి అభిప్రాయపడినట్టు, “ఇవాళ ఓటీటీ (ఓవర్ ది టాప్) వేదికలు వచ్చి, సినిమా స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని అనుకుంటే పొరపాటు. నిజానికి, సినీ ప్రపంచాన్ని మరింత విస్తరింపజేస్తున్నాయి. కొత్త తరహా కథలు, కథనరీతులు, ఇంతకాలం లోకానికి వినిపించని అనేక గొంతులకు ఓటీటీ జాగా ఇస్తోంది.”

ఈ కొత్త అవకాశాన్నీ, అందుబాటులో ఉన్న స్థానాన్నీ ఓటీటీలు తమ ఒరిజినల్స్ ద్వారా ఎంతవరకు అందిపుచ్చుకుంటాయో చూడాలి. వాటికి తగిన వాతావరణాన్నీ, వసతులనూ కల్పిస్తే... సొంత గడ్డపై సరికొత్త ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందన్నదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల దృష్టి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే ‘జియో – హాట్‌స్టార్‌’ ప్రతిపాదనకు తమిళనాడు సై అన్నా, ‘ఐఫా’తో తెలంగాణ జట్టు కట్టినా అందరూ ఈ ‘ఆరెంజ్ ఎకానమీ’ కోసమే మరి!

-రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement