‘‘ఒక్క సినిమా చాలు అనుకున్న నేను 20 సినిమాలు చేశాను. వీటిలో హిట్ చిత్రాలకు కారణం నా కష్టమైతే ఫెయిల్యూర్స్‌కి కారణం కూడా నేనే. మహేశ్‌గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా, నేను అడగలేదు. నేను ఇరవై సినిమాలు చేయడానికి కారాణం ఒక్కటే. కృష్ణగారి అల్లుడు, మహేశ్‌గారి బావ... సుధీర్‌బాబు. అయితే నా యాక్షన్ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీస్‌కి తిరిగాను. నాకు కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు కానీ ఫిల్మ్‌నగర్ బాధలు తెలుసు. అవకాశాల కోసం బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు.
ఇవన్నీ నేను సింపతీ కోసం చెప్పట్లేదు. మీరందరూ (వేడుకలో వీక్షకులను ఉద్దేశిస్తూ..) మహేశ్‌బాబుగారిపై ప్రేమతోనే వచ్చారు. థ్యాంక్యూ సో మచ్. కానీ ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారని, నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారని నా మనసుకు తెలుస్తోంది. నేను మరింత కష్టపడతాను’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌లో, శిల్పా శిరోద్కర్ కీ రోల్‌లో నటించిన చిత్రం ‘జటాధర’.
ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను చేసిన 20 సినిమాల్లో ‘జటాధర’ బెస్ట్ స్క్రిప్ట్. ఇందులో ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం శివ తాండవం చేయడం అద్భుతమైన అనుభూతి. ఇది ఆ శివుని దీవెనగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు శివిన్, ప్రేరణ.


