‘‘సినిమా మేకింగ్‌లో సాంకేతికత పెరిగినప్పటికీ మనుషుల భావోద్వేగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రత్యామ్నాయం కాదు... కాలేదు’’ అని హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ పేర్కొన్నారు. ఇటీవల స్పీల్‌బర్గ్ సినిమా మేకింగ్‌లో కృత్రిమ మేధ వినియోగంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన ఏం మాట్లాడారంటే... ‘‘కళలో మానవీయ కోణం అన్నది ఎంతో ముఖ్యం. రచయితల టేబుల్ వద్ద ఒక కుర్చీ ఖాళీగా ఉండి ఆ స్థానాన్ని ఏఐ భర్తీ చేయడాన్ని నేను ఇష్టపడను. సొంతంగా ఆలోచించే లేదా అనుభవించే స్పృహ కంప్యూటర్లకు ఉంటుందని నేను నమ్మను.
మానవ ఆత్మకు, వారి అంతర్గత సృజనాత్మకతకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదు. సినిమా అనేది కొన్ని కమాండ్స్ సమాహారం కాదు. అది మానవ మేధస్సు, హృదయం నుండి వచ్చే అద్భుత సృష్టి. ఏఐని ఒక టూల్‌గా ఉపయోగించుకోవడానికి అభ్యంతరం లేదు. సినిమా షూటింగ్ కోసం అనువైన లొకేషన్లను వెతకడంలో ఏఐ సహాయం తీసుకుంటే ఓకే.
అయితే సినిమా రంగంలో సృజనాత్మక ప్రక్రియకు సంబంధించిన ఏ విషయానికైనా ఏఐని తుది నిర్ణయంగా తీసుకోకూడదని హాలీవుడ్‌ని కోరుతున్నాను. భవిష్యత్తులో నేను చేసే సినిమాలకు ఏఐ అనేది విరుద్ధం. నటీనటుల ఎంపిక, కెమెరాను ఏ కోణంలో పెట్టాలి? డైలాగులు ఎలా రాయాలి? వంటి సృజనాత్మక విషయాలను ఏఐ టూల్ నాకు సూచించడానికి నేను పూర్తి వ్యతిరేకం’’ అని స్పీల్‌బర్గ్ పేర్కొన్నారు. – స్టీవెన్ స్పీల్‌బర్గ్


