ఎక్కడా స్టార్ 'పవర్' పనిచేయట్లేదు | Star Value Not Worth For Now A Days For Movies | Sakshi
Sakshi News home page

స్టార్స్ ఉన్నా జనాలు పట్టించుకోవట్లేదు

May 8 2026 9:12 PM | Updated on May 8 2026 9:12 PM

Star Value Not Worth For Now A Days For Movies

ఓ సినిమాకు జనాలు రావాలన్నా, అటెన్షన్ ఏర్పడాలన్నా అందులో స్టార్స్ కచ్చితంగా ఉండాలి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఇదే ఫార్ములా నడుస్తోంది. అందుకే దర్శకనిర్మాతలు కూడా చిన్న, మిడ్ రేంజ్ కంటే స్టార్ హీరో లేదా హీరోయిన్ల వెంట పడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్‌కి కాలం చెల్లిందా అనే సందేహం కలుగుతోంది. తాజాగా వస్తున్న సినిమాల బాక్సాఫీస్ ఫలితాలే దీనికి ఉదాహరణ.

(ఇదీ చదవండి: మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్)

గత వారం దక్షిణాదిలో రిలీజైన సినిమాలనే తీసుకుంటే తమిళ స్టార్ హీరో ధనుష్ నుంచి 'కర' వచ్చింది. ఇతడి నుంచి వచ్చే రెగ్యులర్ రొటీన్ స్టైల్ కంటెంటే ఉండేసరికి తెలుగు, తమిళంలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. థియేటర్లకు జనాలు పెద్దగా రాలేదు. ధనుష్, మమిత బైజు లాంటి మంచి యాక్టర్స్ ఉన్నప్పటికీ టాక్ నెగిటివ్ రావడంతో ‍తేలిపోయింది.

సాయిపల్లవి సినిమా చేసిందంటే దానిపై కచ్చితంగా ఓ మాదిరి బజ్ ఏర్పడుతుంది. కానీ ఈమె హిందీలో చేసిన తొలి చిత్రం 'ఏక్ దిన్' ఘోరమైన డిజాస్టర్ అయింది. నిర్మాతగా వ్యవహరించిన ఆమిర్ ఖాన్.. ప్రీమియర్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సాయిపల్లవి యాక్టింగ్ మెచ్చుకుని ఆకాశానికెత్తేశాడు. అయినా సరే ప్రేక్షకులు మనసు కరగలేదు. సాయిపల్లవి యాక్టింగ్ బాగున్నా సరే ఈ మూవీని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. తెలుగులోనూ 'ఒక రోజు' పేరిట విడుదలైంది గానీ ఆ సంగతే జనాలు తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మలయాళంలో టాప్ స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ కలిసి నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పేట్రియాట్'. వీళ్ల ముగ్గురికి తోడు నయనతార, రేవతి, దర్శనా రాజేంద్రన్, కుంచకో బోబన్ లాంటి స్టార్ కాస్ట్ ఉండేసరికి సినిమాపై బజ్ చాలానే ఏర్పడింది. కానీ కంటెంట్ ఏ మాత్రం ఆసక్తిగా లేకపోయేసరికి వీకెండ్ అయ్యేసరికి బాక్సాఫీస్ దగ్గర చల్లబడిపోయింది. తెలుగులో దీన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేద్దామనుకుని వాయిదా వేశారు. పరిస్థితి చూస్తుంటే ఇక డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయడం కష్టమే.

పైన చెప్పిన మూడు సినిమాలే కాదు ఈ ఏడాది రిలీజైన రాజాసాబ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్లోనూ ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ ఉన్నారు. కానీ ఏం లాభం? కంటెంట్ బాగోలేదనే టాక్ మొదటి ఆటకే రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రాల్ని లైట్ తీసుకున్నారు. దీనిబట్టి దర్శకనిర్మాతలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూవీలో స్టార్స్ ఉంటే సరిపోదు అందుకు తగ్గ కథాకథనాలు కూడా కచ్చితంగా ఉండాలి. లేదంటే నిర్ధాక్ష్యిణ్యంగా ఫ్లాప్, డిజాస్టర్ కావడం ఖాయం!

(ఇదీ చదవండి: గవర్నర్‌తో విజయ్ భేటీ.. 'జన నాయగణ్' నిర్మాత ఎందుకున్నట్లు?)

Advertisement
 
Advertisement
Advertisement