Mahesh Babu: మహేశ్‌ బాబు ఆ మాట అనగానే చాలా బాధ పడ్డా

SJ Surya Response On Mahesh Babu Nani Movie Result - Sakshi

కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే.. మధ్య మధ్యలో ప్రయోగాలు చేస్తుంటాడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు. ఆయన చేసిన ప్రయోగాల్లో కొన్ని వర్కౌట్‌ అయ్యాయి.. మరికొన్ని బెడిసి కొట్టాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘నాని’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ సినిమాలో మహేశ్‌ నటనకు మంచి మార్కులు పడినా.. నిర్మాతలకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ఫలితంపై దర్శకుడు ఎస్‌జే సూర్య స్పందించాడు. సినిమా పరాజయం తర్వాత మహేశ్‌ అన్న ఒక్కమాట తననెంతో బాధ పెట్టిందని అన్నాడు. 

‘నాని సినిమా విషయంలో నాకు ఎప్పటి నుంచో ఓ బాధ మిగిలిపోయింది. పెద్ద హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ దర్శకుడిని అయ్యాను.  ప్రతీ సినిమాను ప్రేమతోనే చేస్తాం.. మన శక్తినంతా ధారపోస్తాం. కానీ ఈ చిత్రంలో తప్పు జరిగింది. సినిమా విడుదలయ్యాక ఓ సారి మహేశ్‌ ‘మీరు ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఫలితాన్ని పక్కన పెడితే.. మిమ్మల్ని, మీ పనితనాన్ని ఇష్టపడుతున్నా’అని అన్నారు.

ఆయన అలా అనడం నాకింకా బాధను కలిగించింది. పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇచ్చాను.. కానీ మహేష్ బాబు గారికి హిట్ ఇవ్వలేదు. దేవుడు నాకు భవిష్యత్తులో అవకాశం ఇస్తారు.. ఇప్పుడు నేను యాక్టింగ్‌లో బిజీగా ఉన్నాను.. నటించే పిచ్చి తగ్గిన తరువాత.. నేను సినిమాలు తీస్తాను. అప్పుడు నేను మహేష్‌ బాబు గారితోనే సినిమా చేస్తాను.. ఆయన్ను ఒప్పిస్తాను' అని ఎస్ జే సూర్య అన్నాడు. ఎస్‌జే సూర్య నటించిన ‘వదంతి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ‘నాని’ ఫలితంపై స్పందించాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top