దగ్గరవాళ్లు చనిపోతే ఆ బాధ అనుభవించడం కష్టం. అలాంటిది కడుపు పుట్టిన పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. సింగర్ చిత్ర కూడా అలాంటి వేదనని గత 15 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది తన కూతురు ఇక లేదనే విషయాన్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా కుమార్తెని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో తన బాధని పోస్ట్ రూపంలో చిత్ర పంచుకున్నారు.
(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?)
'నువ్వు మాతో పాటు లేవనే నిజం నన్ను బాధపెడుతూనే ఉంది. కానీ మళ్లీ మనం కలుసుకునేంత వరకు నువ్వు నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతావ్' అని కుమార్తె నందన ఫొటోని చిత్ర.. బాధతో పోస్ట్ చేశారు.
కేరళకు చెందిన చిత్ర.. భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. విజయ్ శంకర్‌తో వివాహమైన చాలా ఏళ్ల తర్వాత ఈమెకు 2002లో కూతురు పుట్టింది. ఆమెకు నందన అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ విధి కన్నుకుట్టిందో ఏమో గానీ పాపకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు అంటే 2011లో దుబాయిలో జరిగిన ఓ ప్రమాదంలో ఈత కొలనులో పడి నందన చనిపోయింది. అప్పటినుంచి వేదన అనుభవిస్తున్నప్పటికీ.. మరోవైపు గాయనిగానూ చిత్ర కొనసాగుతున్నారు. ఇప్పుడు పోస్ట్ పెట్టి కూతురిని చిత్ర మరోసారి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
(ఇదీ చదవండి: మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్)


