
తగ్గేదే లే అంటూ... ‘పుష్ప’ మేనరిజమ్‌తో దేవిశ్రీ ప్రసాద్, నవీన్, రష్మిక, అల్లు అర్జున్, సుకుమార్
ప్రతి ఏడాది నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుకలు ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతున్నాయి. 13వ సైమా అవార్డు వేడుకని దుబాయ్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్ పో సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు.
‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ‘సైమా’ అవార్డ్‌ని సొంతం చేసుకున్నారు. ‘సైమా’ నుంచి ఆయన అందుకున్న ఐదో అవార్డు ఇది. ‘సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అల వైకుంఠపురములో (2021), పుష్ప (2022)’ వంటి చిత్రాలకుగాను ఇప్పటికే ఆయన నాలుగుసార్లు ఉత్తమ నటుడిగా అవార్డ్స్ అందుకున్నారు.
ఇక ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి ఉత్తమ నటిగా రష్మికా మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీతదర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా శంకర్‌బాబు అవార్డులు అందుకున్నారు. ‘కల్కి 2898 ఏడి’ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత సి. అశ్వనీదత్, ఉత్తమ ప్రతినాయకుడి అవార్డును కమల్‌హాసన్, ఉత్తమ సహాయ నటి అవార్డును అన్నా బెన్‌లకు ప్రదానం చేశారు. ఇదే చిత్రానికి ఉత్తమ సహాయనటుడి అవార్డుకు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు.
హీరో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికిగాను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, రచయిత రామజోగయ్య శాస్త్రి, గాయని శిల్పారావు అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) తేజ సజ్జా, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటి (క్రిటిక్స్) మీనాక్షీ చౌదరి... ఇంకా పలు విభాగాల్లో పలువురు తారలు అవార్డులు అందుకున్నారు.
‘పుష్ప 3’ ఉంటుంది: ఇదే వేదికపై ‘పుష్ప 3’ ఉంటుందా? అని సుకుమార్‌ని యాంకర్ అడగ్గా... అల్లు అర్జున్ వైపు చూశారాయన. ఆ తర్వాత ‘ఉంటుంది’ అని స్పష్టం చేశారు సుకుమార్.