ఒకప్పుడు అంటే ఎలాంటి కమర్షియల్ సినిమాలు తీసినా సరే ఎలాగోలా హీరోల బండి నడిచేది. కానీ గత కొన్నాళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్ని చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి దారుణంగా తయారైంది. దానికి తోడు పలువురు హీరోల మూవీస్ కూడా పెద్దగా వర్కౌట్ కావట్లేదు. అలాంటి వాళ్లలో శర్వానంద్ ఒకడు. ఇంతకీ ప్రస్తుతం ఈ హీరో ఏం చేస్తున్నాడు? కొత్త మూవీస్ సంగతేంటి?
గమ్యం, ప్రస్థానం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ అదృష్టం త్వరగా కలిసి రాలేదు. మంచి నటుడే అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ 2014లో 'రన్ రాజా రన్' హిట్ కొట్టి ట్రాక్‌లోకి వచ్చాడు. అలా 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. కానీ తర్వాత చేసిన రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. చివరగా 2022లో 'ఒకే ఒక జీవితం' చిత్రంతో పర్వాలేదనిపించుకున్నాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
యంగ్ హీరోలు అంటే ఎలా ఉండాలి? పెద్ద హీరోల్లా కాకుండా ఏడాది కనీసం ఒకటి రెండు సినిమాలైనా చేస్తూ ప్రేక్షకుల దృష్టిలో ఉండాలి. లేదంటే ఆడియెన్స్ వీళ్లని మర్చిపోయే అవకాశముంది. అలాంటి శర్వానంద్ నుంచి గత మూడేళ్లలో ఒక్కటే సినిమా వచ్చింది. అది గతేడాది రిలీజైన 'మనమే'. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ ఏడాది ఏవైనా కొత్త చిత్రాలు తీసుకొస్తాడా అని చూస్తే ప్రస్తుతానికైతే ఆ సూచనలు కనిపించట్లేదు.
2026లో శర్వానంద్ నుంచి ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో 'నారీ నారీ నడుమ మురారి' చిత్రం సంక్రాంతిని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల క్రితమే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ పండకు చిరంజీవి, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల మూవీస్ ఉన్నాయి. మరి వాళ్లతో పోటీపడి శర్వా బరిలోకి దిగుతాడా అనేది చూడాలి? మరోవైపు బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామా మూవీ, భోగీ అనే యాక్షన్ మూవీ కూడా ఈ హీరో చేస్తున్నాడు. వీటితో హిట్ కొట్టి కమ్ బ్యాక్ అయితే సరేసరి. లేదంటే మాత్రం ప్రస్తుత జనరేషన్‌లో వెనకబడిపోయే ప్రమాదముంది? మరి 2026 అయినా శర్వాకు కలిసొస్తుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


