శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ రాజమహేంద్రవరంలో ఆరంభమైంది. ‘‘ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళుతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.
శర్వానంద్ కెరీర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘భోగి’ ఒకటిగా నిలిచేలా రూపొందిస్తున్నాం. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్‌తో కూడిన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.
1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రక్షా బంధన్ సందర్భంగా ఆగస్ట్ 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కిశోర్ కుమార్ అరోకియా.


