
ఏ ఎండకాగొడుగు అన్న నానుడి వినే ఉంటారు. కాని ఇప్పుడు ఓటిటిల్లో దీనినే ఏ ట్రెండ్ కా స్టోరీ అన్న విధంగా నడుస్తోంది. ఆగష్టు 15 అనగానే , ఆ తేదీకి ముందు తరువాత నెలల్లో దేశభక్తి సినిమాలు రావడం పరిపాటే. ఇలా ప్రస్తుతం ఓటిటి సిరీస్ లు కూడా విడుదలవుతున్నాయి. ఇదే నేపధ్యంలో సరిగ్గా వారం రోజుల వ్యవధిలో రెండు దిగ్గజ ఓటిటిల్లో రెండు సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. వాటిలో జియో హాట్ స్టార్ వేదికగా సలాక్కార్ ఒకటి అయితే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సారే జహా సే అచ్చా మరొకటి. వీటిలో విశేషం ఏమిటంటే రెండు కథాంశాలు దాదాపు ఒకటే. పాత్రలు, కథను నడిపించిన తీరు తప్ప రెండూ అన్నిటికీ అన్నీ సమానమే.అంతలా వీటిలో ఉన్న కథాంశమేమిటో ఓ సారి చూద్దాం.
1960 నుండి 1990 సంవత్సర కాలంలో భారతదేశానికి యుద్ధాలు, ఇతర దేశాల నుండి కవ్వింపు చర్యలు లాంటివి ఎన్నో జరిగాయి. సరిగ్గా పాకిస్తాన్ భారత్ తో యుద్ధం జరిగిన ఆ సమయంలో పాకిస్తాన్ దేశం న్యూక్లియార్ బాంబును తయారు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కాని ఆ ప్రయత్నాలన్నీ మన దేశానికి సంబంధించిన గూఢాచార సంస్థ రా నాశనం చేసింది. తమ సంస్థ ద్వారా పాకిస్తాన్ లోకి గూఢాచారులను పంపి పాకిస్తాన్ న్యూక్లియార్ బాంబు తయారీని సమర్ధవంతంగా ఎదుర్కుంది.
ఇప్పుడు పైన చెప్పుకున్న రెండు టీవి సిరీస్ లలో ఇదే కథా నేపధ్యం. 1978 లో పాకిస్తాన్ దేశం జనరల్ జియా నేతృత్వంలో ఉంది. ఆ సమయంలో ఆదిర్ దయాళ్ అనే గూఢాచారి ఇండియన్ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా పాకిస్తాన్ లో ప్రవేశిస్తాడు. పాకిస్తాన్ లోని ఓ ప్రాంతంలో న్యూక్లియార్ బాంబు తయారవుతుందని తెలుసుకోని ఆ ప్రయత్నాలను నాశనం చేయడమే జియో హాట్ స్టార్ లో 5 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సలాక్కార్ కథ.
1972 లో పాకిస్తాన్ దేశం భారత్ తో షిమ్లా ఒప్పందం తరువాత ఆ దేశ నేత అయిన జుల్ఫికర్ అలీ భుట్టో వేరే దేశాల నుండి విడిభాగాలు తెప్పించి పాకిస్తాన్ లో న్యూక్లియార్ బాంబు తయారు చేయాలనుకుంటాడు. ఈ ఆపరేషన్ కి ఐయస్ఐ హెడ్ అయిన ముర్తజా మాలిక్ ని నియమిస్తాడు. మాలిక్ ఆపరేషన్ ని పాకిస్తాన్ లోనే ఉన్న భారత గూఢాచారి విష్టు సర్వనాశనం చేస్తాడు.ఇదే నెట్ ఫ్లిక్స్ లో 6 ఎపిసోడ్లతో స్ట్రీమ్ అవుతున్న సారే జహా సేఅచ్ఛా సిరీస్ కథ.
రెండు సిరీస్ లు థ్రిల్లర్ జోనర్ తో వచ్చినవే.చూసే ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయనడంలో సందేహమే లేదు. చరిత్రలో కనమరుగైన మన గూఢాచారుల కథలు ఇవి. వర్త్ ఫుల్ వాచ్