
కోలీవుడ్‌లో నటుడు శింబుది ప్రత్యేక స్థానం. విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నా, అపజయాలను ఎదుర్కొన్నా, ఆయన క్రేజే వేరు. 50 చిత్రాలకు చేరుకున్న ఈయన తాజాగా కొన్ని క్రేజీ చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ కథా చిత్రం అని చిత్ర వర్గాల సమాచారం. వెట్రిమారన్‌కు దర్శకుడిగా ఒక ప్రత్యేక బాణి ఉంది. ఆయన కథలన్నీ సమాజంలోంచి, ముఖ్యంగా అట్టడుగు జనాల జీవితాలను ఆవిష్కరించేవిగా ఉంటాయి.
కాగా ఇంతకుముందు ధనుష్ హీరోగా ఉత్తర చెన్నై నేపథ్యంలో వడచెన్నై అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా తాజాగా మరోసారి అదే నేపథ్యంలో మరో కోణంలో శింబు హీరోగా చిత్రం చేస్తున్నారు. ఇది శింబు కథానాయకుడుగా నటిస్తున్న 49వ చిత్రం అవుతుంది. ఇందులో ఈయనకు జంటగా పూజాహెగ్డే నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్రలో సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె ప్రస్తుతం హిందీలో ఏక్ దిన్ చిత్రాన్ని పూర్తి చేసి, రామాయణ 1, 2 చిత్రాలను చేస్తున్నారు. ఇందులో సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత ఈమె మళ్లీ తమిళంలో నటించనున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.