
‘సోషల్ మీడియాలో పిల్లల మీద అబ్యూజ్ చేస్తున్నారు. అలాంటి కామెంట్లు చేస్తే కూడా లైక్స్ చేస్తున్నారు.నవ్వుతున్నారు. అవన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మనం ఇలాంటి సమాజాన్ని కోరుకున్నామా?’ అని సాయి దుర్గతేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ..సోషల్ మీడియాలో చిన్న పిల్లల మీద పిచ్చి కామెంట్లు చేస్తున్నా..అవి చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా అది తప్పని చెప్పడం లేదు. డార్క్ కామెడీ టాపిక్‌పై ఎవరైనా మాట్లాడాతారా? మీడియా స్పందిస్తుందా? అని నేను ఎదురు చూశాను. కానీ ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. ఇక ఆ బాధ్యతను నేను తీసుకున్నాను. అందుకే నేను ఆ సమయంలో అలా రియాక్ట్ అయ్యాను. డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉంది.. కానీ ఎదుటి వాళ్లని బాధ పెట్టే వరకు ఉండకూడదు.
ఇప్పుడు పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. ఇప్పుడంటే చాట్ జీటీపీ, ఏఐ అంటున్నారు.. కానీ నాకు మాత్రం మా అమ్మే ప్రపంచం. అమ్మ, మామయ్యలు, స్నేహితులు ఇలా అందరితో నేను సమయాన్ని ఎక్కువగా గడిపేవాడ్ని. పిల్లలతో పేరెంట్స్ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వాలి. నేను నా సెకండ్ క్లాస్‌లోని లవ్ స్టోరీని మా అమ్మతో చెప్పాను. అలా చెప్పే స్వతంత్రాన్ని నాకు ఆమె ఇచ్చారు. పేరెంట్స్‌తో అన్ని విషయాల్ని పంచుకునేలా పిల్లలకు స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలకు ప్రతీ విషయాన్ని ప్రేమతో చెప్పే ప్రయత్నం చేయాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ విషయాల్ని స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ చెప్పే ప్రయత్నం చేయాలి.
ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో బిజీగా మారిపోయారు. కనీసం వారంలో ఓ పూట అయినా మన ఫ్యామిలీతో కలిసి గడపాలి.. కలిసి మాట్లాడుకోవాలి. అందరికీ బాధ్యతల్ని నేర్పించాలి. సోషల్ మీడియాలో పిల్లలు ఏం చేస్తున్నారో చూసుకోవాలి. సోషల్ మీడియా ఐడీలు తల్లిదండ్రుల నంబర్లకు కనెక్ట్ చేయడమో లేదా ఆధార్ కార్డ్‌కి లింక్ చేయడమో ఏదో ఒకటి చేయాలి’ అని సాయి దుర్గతేజ్ డిమాండ్ చేశారు.