హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఏది పట్టినా బంగారమే అవుతోంది. యానిమల్ నుంచి కుబేర వరకు ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే.. ఒక్క సికిందర్ తప్ప! ఈ ఏడాది రష్.. ఇప్పటివరకు నాలుగు సినిమాల(ఛావా, సికిందర్, కుబేర, థామా)తో అలరించింది. ఇప్పుడేకంగా ఐదో మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్' (The Girlfriend Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

టాక్ షోలో రష్మిక
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ కోసం బాగానే కష్టపడుతోందీ బ్యూటీ. ఈ మధ్యే తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ స్టేజీపైనా సందడి చేసింది. తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరైంది. ఈ టాక్ షోలో సినిమా కోసమే కాకుండా ఇతరత్రా విషయాలపైనా మాట్లాడింది.
మగాళ్లకు పీరియడ్స్ రావాలి
ముందుగా ఆమె మనసులో ఉన్న కోరిక గురించి జగపతిబాబు ప్రస్తావించాడు. మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీలైనట్లున్నావ్? అని అడిగాడు. అందుకు రష్మిక క్షణం ఆలోచించకుండా అవునని తలూపింది. మగాళ్లకు ఒక్కసారైనా పీరియడ్స్ వస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.


