Ram Charan: ప్రధాని మోదీ నాతో ఓ స్ఫూర్తి నింపే స్టోరీ చెప్పారు | Ram Charan Takes New Precautions Hindi Language Chaos Happen In Bhopal Ahead Of Peddi Pan India Release | Sakshi
Sakshi News home page

Ram Charan: ప్రధాని మోదీ నాతో ఓ స్ఫూర్తి నింపే స్టోరీ చెప్పారు

May 28 2026 11:19 PM | Updated on May 29 2026 5:54 PM

Ram Charan takes new precautions Hindi Language chaos Happen in Bhopal

పాన్‌ ఇండియా స్థాయిలో జూన్‌ 4న విడుదల కానున్న పెద్ది సినిమాకు ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. భోపాల్‌, బెంగళూరులో ఇప్పటికే ప్రచారం చేసిన చిత్ర బృందం గురువారం ఢిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ చిత్ర హీరో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆయన ‘పెద్ది’ సినిమా కథ దేని గురించి అని అడిగారు. దానికి నేను వికసిత్‌ భారత్‌ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే కథను పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ చిన్న గ్రామంలో మహ్మద్‌ అనే ఓ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ఉండేవాడు. అతను భారత్‌ తరఫున ఆడి తన ఊరికి గుర్తింపు తెచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్‌ ఉన్నారని చెప్పారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మార్పు తీసుకురాగలడో దానికి ఇది ఓ ఉదాహరణ. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’ అని చరణ్‌ వివరించారు.

ఇక భోపాల్‌లో హిందీ మాట్లాడి ఇబ్బందులు ఎదుర్కొన్న రామ్ చరణ్ ఈసారి జాగ్రత్త పడ్డారు. తాజాగా ఢిల్లీలో జరిగిన పెద్ది సినిమా ప్రచార కార్యక్రమంలో చరణ్ పూర్తిగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు. ఒక దశలో ఎవరి పేరైనా మరిచిపోతే, తన టీమ్‌ను అడిగి నిర్ధారించుకొని మరీ చెప్పాడు. ఇక పెద్ది సినిమాను చిన్నారులందరికీ చూపించాలని తల్లిదండ్రులను చరణ్ కోరాడు. 'పిల్లలపై ఈ సినిమా ఎంత ప్రభావం చూపుతుందో నేను చెప్పలేను. కానీ ఈ సినిమా చూపించిన తల్లిదండ్రులు మాత్రం అసంతృప్తి చెందరు" అని హామీ ఇచ్చాడు.  

గతంలో భోపాల్‌లో జరిగిన ఈవెంట్‌లో హిందీ మాట్లాడే ప్రయత్నంలో చరణ్ గందరగోళానికి గురయ్యాడు. ఒక దశలో భోపాల్ అనడానికి బదులు బిహార్ అన్నాడు. చివర్లో క్రికెటర్‌ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. బుమ్రాకు సంబంధించి వివరణ ఇచ్చినా, ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అందుకే ఈసారి ఇంగ్లిష్‌లోనే మాట్లాడాడు.  

మరోవైపు, పెద్ది సినిమాకు మద్రాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్ మంజూరు చేసింది. సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా క్లిప్స్ లీక్ చేయడం లేదా అక్రమంగా షేర్ చేయడం వంటివి జరిగితే, చిత్ర యూనిట్ చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పూర్తి స్వేచ్చ ఉంటుంది. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం సినిమా కంటెంట్‌ను అనధికారికంగా అప్‌లోడ్, స్ట్రీమింగ్ లేదా షేర్ చేయరాదు. భారీ బడ్జెట్ చిత్రాలకు ఇలాంటి లీగల్ రక్షణ చర్యలు చాలా కీలకమనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement