టైటిల్: రాజు వెడ్స్ రాంబాయి
నటీనటులు: అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు
నిర్మాణ సంస్థ: డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్
నిర్మాతలు:వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
దర్శకత్వం: సాయిలు కంపాటి
సంగీతం: సురేశ్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
విడుదల తేది: నవంబర్ 21, 2025
‘రాంబాయి నీ మీద నాకు మనసాయనే..’ అనే పాటతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే ఓ సినిమా వస్తుందన్న విషయం జనాలకు తెలిసింది. అప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కానీ పాట హిట్ అవ్వడం..ట్రైలర్ ఆకట్టుకోవడంతో ‘రాజు వెడ్స్ రాంబాయి’పై అంచనాలు పెరిగాయి. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ‘ఈ సినిమా హిట్ కాకపోతే అమీర్‌పేట్ సెంటర్‌లో బట్టలిప్పి తిరుగుతా’ అని చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి చాలెంజ్ చేయడం..ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా? లేదా? రివ్యూ(Raju Weds Rambai Review)లో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా..2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్-ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊళ్లో రాజు(అఖిల్ రాజు) బ్యాండ్ కొట్టడంలో చాలా ఫేమస్. పెళ్లికి అయినా..చావుకైనా రాజుగాడి బ్యాండ్ మోగాల్సిందే. నాన్న(శివాజీ రాజా) వద్దని చెప్పినా బ్యాండ్ కొట్టే పనిని వదలడు రాజు. అంతేకాదు హైదరాబాద్ వెళ్లి ఏదో ఒక పని చేయమని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేసినా.. వినిపించుకోడు. దానికి కారణం రాంబాయి(తేజస్విని రావ్). ఆమె అంటే రాజుకి చచ్చేంత ప్రేమ. రాంబాయి మొదట్లో రాజు ప్రేమను వ్యతిరేకించినా..కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రేమిస్తుంది.
రాంబాయి తండ్రి వెంకన్న(చైతన్య జొన్నలగడ్డ)కి మాత్రం..తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రాజుతో పెళ్లంటే నాన్న ఒప్పుకోడనే భయంతో ముందే గర్భవతి కావాలనుకుంటుంది రాంబాయి. రాజుతో ఈ విషయం చెప్పి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం వెంకన్నకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? వెంకన్న మూర్ఖత్వం రాజు-రాంబాయి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలిగించింది? చివరకు రాజు-రాంబాయి పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమా నేపథ్యం కూడా అలాంటిదే. అయితే ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అగ్రవర్ణాల్లోనే పరువు హత్యలు ఉన్నట్లుగా చూపించారు. కానీ అణగారిన వర్గాల్లోనూ పరువు హత్యలు జరుగుతాయని కళ్లకు కట్టినట్లుగా చూపించడం రాజు వెడ్స్ రాంబాయి ప్రత్యేకత. ఇది కల్పిత కథ కాదు.. నిజంగా జరిగిన సంఘటన.
2010 ప్రాంతంలో ఇల్లందు అనే పల్లెటూరిలో జరిగిన ఓ పరువు హత్య ఘటనకు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. దానికి కారణం ఇంతరవకు ఏ జంటకు ఎదురు కానీ ఓ దుర్మార్గం ఈ ఘటనలో ఉంది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కుతాయి. అయితే అది క్లైమాక్స్ మాత్రమే. మిగతా కథంతా రెగ్యులర్ లవ్‌స్టోరీనే గుర్తు చేస్తుంది. 2010 నాటి స్టోరీ కావడంతో..అప్పటి యువత చేసే అల్లరి పనులు..ముఖ్యంగా గ్రామాల్లోనే ఉండే యువతీయువకులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది..90స్ కిడ్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇదంతా ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్‌లో కథను సాగదీశారు.
ఓ ప్రేమ జంట పెళ్లిలో రాజు చేసే హడావుడి సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. రాంబాయి ఎంట్రీ తర్వాత కథనం పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు రాజు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఒకవైపు వీరిద్దరి లవ్‌స్టోరీ.. మరోవైపు రాజు గ్యాంగ్ చేసే అల్లరితో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది.
రాజు-రాంబాయి లవ్‌స్టోరీ వెంకన్నకు తెలిసిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ భావోద్వేగానికి గురి చేస్తుంది. సెకండాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. ప్రేమ విషయం తెలిసిన తర్వాత వెంకన్న చేసే పనులు.. రాజు-రాంబాయి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్‌గా ఉంటాయి. పైగా కథనం నెమ్మదిగా సాగడంతో చాలా బోరింగ్ అనిపిస్తుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్ షాకివ్వడమే కాకుండా గుండెను బరువెక్కిస్తుంది. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా? అనే భయం ఒకవైపు.. ఇప్పటికీ రాజు-రాంబాయి లాంటి స్వచ్ఛమైన ప్రేమికులు కూడా ఉన్నారా? అనుమానంలో ప్రేక్షకుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తాడు.
ఎవరెలా చేశారంటే..
హీరోహీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ చాలా బాగా నటించారు. అన్ని రకాల ఎమోషన్స్‌ని పండించారు. తెలంగాణ యాసని చక్కగా పలికారు. కొన్ని సీన్లలో తేజస్వీరావు ఎంతో అనుభవం ఉన్న నటిలాగా నటించింది. వెంకన్నగా చైతన్య నటన ఈ సినిమాకే హైలెట్. చాలా బాగా నటించాడు. అయితే రైటింగ్ లో లోపం వల్ల కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్‌గా నటించినవారంతా బాగా చేశారు. ముఖ్యంగా డాంబర్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. శివాజీరాజాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలంగాణ పల్లెటూరి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


