
కొందరికీ ఏ సందర్భంలో ఏం చేయాలో కూడా ఆలోచన ఉండదు. వచ్చిన సందర్భం ఏంటి? మనం చేస్తున్న పనేంటి? అని ఆలోచిస్తే ఈ రోజు అలా జరిగి ఉండేది కాదు. మన దర్శకధీరుడు రాజమౌళికి కోపం వచ్చేది కాదు. ఓ అభిమాని చేసిన పనికి ప్రశాంతంగా ఉండే మన డైరెక్టర్ కోపం తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇవాళ టాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనారోగ్యంతో తెల్లవారుజామున కన్నుమూశారు. తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ టాలీవుడ్ ప్రముఖులంతా నివాళులర్పించేందుకు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వచ్చారు. ఈ క్రమంలోనే రాజమౌళి తన సతీమణితో కలిసి కోట శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు.
అనంతరం అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా ఓ అభిమాని చేసిన పని రాజమౌళికి కోపం తెప్పించేలా చేసింది. తన కారు వైపు వెళ్తున్న డైరెక్టర్ను ఓ అభిమాని సెల్ఫీ కోసం వెంటపడ్డారు. ఫోటో తీసుకునేందుకు ఆయన కారు వరకు వెళ్లాడు. దీంతో అసహనానికి గురైన రాజమౌళి ఏంటిది? అంటూ అతన్ని తోసేశాడు. ఇది చూసిన నెటిజన్స్ అభిమానిపై మండిపడుతున్నారు. వచ్చిన సందర్భం ఏంటో తెలుసుకోకుండా సెల్ఫీ కోసం ఎగబడడం ఏంటని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.