
తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మే 31వ తేదీ నుంచి బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారం, జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేయబడతాయి. తాజాగా నిర్మాత ఎస్‌కేఎన్ ఈ అంశంపై స్పందించారు. ఘటికాచలం సినిమా ట్రైలర్ వేడుకలో ఆయన పలు అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. చిత్రపరిశ్రమ ఐసీయూలో ఉందని, ప్రస్తుతం యాంటీ బయాటిక్స్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.
'సినిమా పర్సంటేజీల విధానం కంటే మనం ముందు ప్రేక్షకులను థియేటర్స్ రప్పించాలి. ఈ విషయంలో వారి నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు థియేటర్స్‌లో దొరికే తినుబండారాల ధరలు మరీ ఎక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. సినీ పెద్దలు వీటిపై దృష్టి పెట్టాలి. ఆపై ఓటీటీల వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. రెండు వారాల్లో ఎటూ ఓటీటీలోకి సినిమా వచ్చేస్తుంది కదా అని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈ అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.
ఉదయం ఆటకు వచ్చే ఆడియన్స్ భారీగా తగ్గిపోతున్నారు. కేవలం ఈవెనింగ్ షో, వీకెండ్స్‌లలో మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్‌కు బాగా వస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి మాములు రోజుల్లో టికెట్ ధరలు తగ్గించడం, వీకెండ్స్‌లో ధరలు పెంచడం వంటి విధానంపై ఆలోచన చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు సుమారు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.' అని ఆయన గుర్తుచేశారు.
సినిమా థియేటర్ల నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని, అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం ద్వారా తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు అంటున్నారు. తమకు మల్టీప్లెక్స్ తరహాలోనే వచ్చే ఆదాయంలో పర్సెంటేజీ విధానాన్ని అమలుచేయాలంటూ సింగిల్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబట్టాయి. అలా చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకి లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అలా పర్సెంటేజీలు పెంచుకుంటూ పోతే సినిమా పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఎస్‌కేఎన్ అభిప్రాయపడ్డారు.