నా ఇంట్లో కోట్లు లేవు, రూ.40 వేలే ఉన్నాయి: నిర్మాత | Producer Jaffer Sadiq Condemns Rumours about IT Raids | Sakshi
Sakshi News home page

నా ఇంట్లో కోట్లు దొరకలేదు.. అసత్య ప్రచారం ఆపండి: నిర్మాత

Apr 10 2026 8:29 AM | Updated on Apr 10 2026 11:02 AM

Producer Jaffer Sadiq Condemns Rumours about IT Raids

మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయి ఈ మధ్యనే బెయిల్‌పై విడుదలయ్యారు నిర్మాత జాఫర్‌ సాదిక్‌. ఈయన నిర్మిస్తున్న మంగై, ఇరైవన్‌ మిగ పెరియవన్‌ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా ఏప్రిల్‌ 6న ఐటీ అధికారులు, ఎన్నికల స్క్వాడ్‌ అధికారులు చెన్నైలో జాఫర్‌ సాదిక్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై జాఫర్‌ స్పందించారు.

ఆ ప్రచారంలో నిజం లేదు
అధికారులు తన ఇళ్లలో సోదాలు నిర్వహించిన విషయం వాస్తవమేనని, అయితే పలు కోట్ల రూపాయలు, ఇతర డాక్యుమెంట్లు పట్టుబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 5వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సోదాలు నిర్వహించారని, ఎలాంటి అనధికారిక డబ్బుకానీ, ఇతర డాక్యుమెంట్స్‌ గానీ లభించలేదని చెప్పి పత్రాలపై సంతకం చేయించుకుని వెళ్లిపోయారన్నారు.

ఇంట్లో అంతే ఉంది
తన ఇంట్లో ఒక సాధారణ కుటుంబ ఖర్చులకు సరిపోయే రూ.40 వేలు మాత్రమే ఉన్నాయన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా పలు శాఖలకు చెందిన అధికారులు తన ఇళ్లల్లో తనిఖీలు చేశారని, అయితే ఐటీ అధికారులు మాత్రమే కరెక్ట్‌గా సోదాలు నిర్వహించారన్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తన గురించి అసత్య ప్రచారం చేయకూడదన్నారు. తాను ప్రశాంతంగా జీవించాలని భావిస్తున్నట్లు తెలిపారు. తను నిర్మిస్తున్న సినిమాలు రిలీజ్‌ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement