చాలా మంది తారల మాదిరే తాను కూడా కెరీర్ తొలినాళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను అంటోంది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేశ్ బాబు-రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రియాంక..తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది.
‘కెరీర్ ప్రారంభంలో డ్యాన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా. నటన పరంగా ఓకే కానీ..డ్యాన్స్ వచ్చేది కాదు. కొరియోగ్రాఫర్ చెప్పిన మూమెంట్స్ మరిచిపోయేదాన్ని. నా పక్కన ఉన్న కోస్టార్ ఆ స్టెప్పులు అద్భుతంగా చేసేవారు. నేనేమో వారికి సరిపోయేలా స్టెప్పులు వేయలేక ఇబ్బంది పడేదాన్ని. ఓసారి దక్షిణాఫ్రికాలో ఓ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు కొరియోగ్రాఫర్ రాజు ఖాన్ నాపై సీరియస్ అయ్యాడు. నువ్వు అందాల పోటీ నుంచి వచ్చిండొచ్చు, అందంగా ఉండొచ్చ.. కానీ నటి కావాలంటే ముందు డ్యాన్స్ నేర్చుకో అంటూ మైక్ కిందపడేసి సెట్ నుంచి వెళ్లిపోయాడు. అది నాకు చాలా అవమానంగా అనిపించింది. దీన్ని సవాలుగా తీసుకొని డ్యాన్స్ నేర్చుకున్నా. అప్పట్లో ప్రతి రోజు దాదాపు ఆరు గంటల పాటు కత్రినా కైఫ్‌తో కలిసి ప్రాక్టీస్ చేశా’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
ఇక హాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో స్టార్ అయినంత మాత్రాన అక్కడి వాళ్లు ఆదరిస్తారని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఒక దేశంలో మీకు పేరు ప్రఖాత్యులు ఉన్నంత మాత్రాన మరో దేశంలో కూడా అదే విధంగా గౌరవం పొందాలని ఆశించకూడదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులను సంపాదించుకోవాలి. ప్రజల నుంచి గౌరవం పొందాలంటే బాగా కష్టపడాలి. ఇప్పుడు నేను అక్కడ సూపర్ స్టార్ కాదు. కానీ నటిగా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నా’ అని ప్రియాంక పేర్కొంది.


