
మహేశ్‌బాబుతో సినిమా గురించి ప్రియాంకా చోప్రా
‘‘ఇండియాని చాలా మిస్ అయిపోతున్నాను. హిందీ సినిమాలను కూడా మిస్సవుతున్నాను. ఇప్పుడు ఓ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంకా చోప్రా చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. ఈ బ్యూటీ నటించిన హాలీవుడ్ చిత్రం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇండియన్ సినిమాల గురించి కూడా మాట్లాడారు. ‘‘ఇండియాలో 2002లో నా తొలి సినిమా (తమిళ చిత్రం ‘తమిళన్’)తో కెరీర్ మొదలుపెట్టి, ఎన్నో రకాల సినిమాలు చేశాను.
ఎందరో ప్రతిభావంతులతో సినిమాలు చేశాను. అందుకే ఈ సంవత్సరం ఇండియన్ సినిమా (మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ఉద్దేశించి) చేయడం చాలా ఆసక్తిగా ఉంది. భారతీయ ప్రేక్షకులు నా పై చూపించే ప్రేమ నాకెంతో విలువైనది. నాపై వారి ప్రేమ ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటున్నా’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు.
హాలీవుడ్ సింగర్–యాక్టర్–మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్‌ని 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత భారతీయ చిత్రాలు ఎక్కువ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్‌లోని సినిమాలో నటించడం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.