జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. అమోరి, ఇవాటే, హొక్కైడో ద్వీపానికి సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. రిక్టర్ స్కేల్‌పై 7.5 నుండి 7.6 వరకు నమోదైంది. దీంతో సినీ నటుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రభాస్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. జపాన్‌లో భూకంపం సంభవించినట్లు వార్తలు రావడంతో ప్రభాస్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌కు చల్లని వార్త ఇచ్చారు.
దర్శకుడు మారుతి తన ఎక్స్ పేజీలో ప్రభాస్ ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు. "డార్లింగ్ (ప్రభాస్)తో మాట్లాడాను. అతను టోక్యోలో లేడు. ఎవరూ ఆందోళన చెందవద్దు. చాలా సురక్షితంగా ఉన్నాడు. చింతించకండి" అని ఆయన రాశారు. ఆయన సందేశం అందరికీ భరోసా ఇచ్చింది. అయితే, ప్రభాస్ త్వరగా ఇండియా తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు.
ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం బాహుబలి: ది ఎపిక్ ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శనల కోసం జపాన్‌లో ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయింది. అక్కడి అభిమానులతో సరదాగా సంభాషించారు. భూకంపం గురించిన నివేదికలు వైరల్ అయిన తర్వాత వారు అందరూ అలెర్ట్ అయ్యారని సమాచారం.


