సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్.. కారణం ఇదే.. | Pakistan Declares Actor Salman Khan A Terrorist Becouse he told Balochistan Separately | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్.. కారణం ఇదే..

Oct 26 2025 1:57 PM | Updated on Oct 26 2025 3:10 PM

Pakistan Declares Actor Salman Khan A Terrorist Becouse he told Balochistan Separately

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కొద్దిరోజుల క్రితం బలూచిస్తాన్‌ (Balochistan)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాక్‌ మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం సల్మాన్‌ను ఒక ఉగ్రవాదిగా ముద్రవేసి.. పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తుల  బ్లాక్‌లిస్ట్‌లో సల్మాన్‌ పేరును పొందుపరిచారు. పాక్‌ చట్టాల ప్రకారం ఈ లిస్ట్‌లో ఉన్న వారిపట్ల  నిఘా, కదలికలపై ఆంక్షలతో పాటు చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది.

పాక్‌ విషయంలో సల్మాన్‌  ఏమన్నారంటే..?
కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియాలో ‘జాయ్‌ ఫోరమ్‌ 2025’ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.. ఇందులో కి బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌తో పాటు షారుక్‌ ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ వంటి స్టార్స్‌ పాల్గొన్నారు. ఈ వేదికపై సల్మాన్‌ మాట్లాడుతూ.. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది. ఆపై తెలుగు, తమిళ్‌, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనని చెప్పాలి. బలూచిస్తాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ (Pakistan) నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా  ఉన్నారు. అంటూ ఆయన మాట్లాడారు.

సల్మాన్‌పై బలూచిస్తాన్‌ ప్రశంసలు
సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. బలూచిస్తాన్‌, పాకిస్థాన్‌లను సల్మాన్‌ఖాన్‌ వేర్వేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది. పాకిస్థాన్‌కు చెందిన బలోచిస్థాన్‌ను ఇలా వేరు చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా కూడా విమర్శలు చేసింది. అయితే, బలూచిస్తాన్‌ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్‌ చేసిన  ప్రకటనను స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఒక ట్వీట్‌ కూడా చేశారు.  సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల  బలూచిస్తాన్‌ ప్రజలకు ఆనందాన్ని కలిగించిందని కృతజ్ఞత తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేశాయని వారు గుర్తుచేశారు. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడాన్ని హైలైట్ చేసేలా సల్మాన్‌ వ్యాఖ్యలు చేరుతాయని అభిప్రాయపడ్డారు.

ఖనిజ వనరులతో సమృద్ధిగా  ఉన్న బలూచిస్తాన్‌ చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి తదితర వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్‌ ఖజానాను కాపాడుతుంది. కానీ, బలూచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాక్‌ నిర్లక్ష్యంగా ఉండటంతో అక్కడ వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడటం ఆపై వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ఇప్పుడు ఏకంగా  ఆక ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే రేంజ్‌కు బలూచిస్తాన్‌ చేరుకుంది. పాక్‌కు పక్కలో బల్లెంలా బలూచిస్తాన్‌ తయారైంది. పాక్‌ నుంచి వేరు కావడంతో పాటు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement