
గత దశాబ్దంలో తెలుగు సినిమా చాలా మారిపోయింది. 'బాహుబలి' సినిమా దెబ్బకు టాలీవుడ్.. ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే 'బాహుబలి' రిలీజై ఈ ఏడాదికి పదేళ్లయిన సందర్భంగా అక్టోబరులో రెండు పార్ట్స్ కలిసి ఒక్కటిగా రీ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు తగ్గ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని భళ్లాలదేవ పాత్రని తానే చేయాల్సిందని, కొన్ని కారణాల వల్ల అది తప్పిపోయిందని సీనియర్ నటి జయసుధ కొడుకు చెబుతున్నాడు.
ఇంతకీ ఏంటి విషయం?
నటి జయసుధ కొడుకు పేరు నిహార్ కపూర్. హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. సహాయ నటుడిగానూ పలు చిత్రాల్లో కనిపించాడు. కాకపోతే గుర్తింపు రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. బాహుబలి మూవీలో అవకాశం మిస్ అయిన సంగతి చెప్పుకొచ్చాడు. అప్పుడు అసలేం జరిగిందో పూసగుచ్చినట్లు వెల్లడించాడు.
(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష‍్మి' గ్లింప్స్ రిలీజ్)
'భళ్లాలదేవుడి పాత్ర రానానే చేయాలి. కానీ ఆయన డేట్స్ సెట్ అవకపోవడంతో నన్ను అడిగారు. ఓకే చెప్పేశాను. నాలుగు వారాల ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆ పాత్రని రానా చేస్తానని మళ్లీ చెప్పడంతో నాకు కాలకేయ పాత్రని ఆఫర్ చేశారు. నేను ఆలోచనలో పడిపోయా. కాలకేయుడి పాత్రకు సంబంధించిన ఓ క్యారికేచర్ చూపించారు. పాత్ర ఇలా ఉంటుందని వివరించారు. ఎక్కువగా ప్రొస్థటిక్ మేకప్ వేశారు. ఇదే విషయాన్ని అమ్మకి చెబితే..'నీ మొదటి సినిమా ముఖం కూడా సరిగా కనిపించట్లేదు బాడీ కూడా కవర్ అయిపోతుంది. ప్రేక్షకులు గుర్తించరు' అని చెప్పారు'
'అమ్మ అలా చెప్పేసరికి 'బాహుబలి' టీమ్‌కి నో చెప్పేశాను. దీంతో ఆ పాత్రని ప్రభాకర్ చేశారు. క్యారికేచర్‌తో పోలిస్తే తెరపైకి వచ్చేసరికి పాత్ర లుక్ పూర్తిగా మారిపోయింది. అయితే ఆ రోల్ చేయనందుకు నేనేం బాధపడట్లేదు. మొదటినుంచి దర్శకుడు రాజమౌళి నాతో అన్ని విషయాలు మాట్లాడారు. ఆ తర్వాత సరదాగా షూటింగ్‌కి రమ్మంటే రెండు మూడుసార్లు వెళ్లాను' అని నిహార్ కపూర్ చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం నిహార్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: Anushka Shetty: ఎక్కడికి వెళ్లినా ఆ దేవుడి విగ్రహం తనవెంటే!)