మనదేశంలో సినిమాకి మించిన వినోదం లేదు: నాని 

Nani Superb Speech At Thimmarusu Pre Release Eve - Sakshi

‘‘థియేటర్లో సినిమా చూడటం అనేది మన సంస్కృతి.. అది మన రక్తంలోనే ఉంది. మనదేశంలో సినిమాకి మించిన వినోదం లేదు’’ అని హీరో నాని అన్నారు. సత్యదేవ్, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని మాట్లాడుతూ–‘‘కరోనా సమయంలో అన్నిటికంటే ముందే థియేటర్లు మూస్తారు.. అన్నిటికంటే చివర్లో తెరుస్తారు. బయట ఉండే ఇతర ప్రదేశాల కంటే థియేటర్స్‌ చాలా సురక్షితం. ఒకరితో ఒకరం మాట్లాడుకోం.. మాస్క్‌లు వేసుకుని సినిమా చూస్తాం. థియేటర్‌ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. ఈ కుటుంబంపై ఆధారపడి లక్షల మంది ఉన్నారు. థియేటర్ల మూత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కానీ, సినిమా విషయానికొచ్చేసరికి చిన్న సమస్యగా ఆలోచిస్తున్నారు. కానీ ఇది చాలా పెద్ద సమస్య. పరిస్థితులు చక్కబడకుంటే మన తర్వాతి తరం థియేటర్స్‌ అనుభూతిని మిస్‌ అవుతారు’’ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘సత్యదేవ్‌ అంటే నాకు నటుడిగా, వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఈ సినిమాతో తనకు స్టార్‌డమ్‌ వస్తుంది. కరోనా థర్డ్‌వేవ్‌లాంటివేవీ రాకుండా మళ్లీ మనం థియేటర్స్‌లో సినిమాలు చూడాలి.  ‘తిమ్మరుసు’ చిత్రం మొదలు ‘టక్‌ జగదీశ్, లవ్‌స్టోరీ, ఆచార్య, రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్‌..’ ఇలా అన్ని సినిమాలను మనం థియేటర్స్‌లో ఎంజాయ్‌ చేయాలి. ‘తిమ్మరుసు’ హిట్‌ అయ్యి ఈ నెల 30 నుంచి విడుదలయ్యే సినిమాలకు ఆక్సిజన్‌ ఇవ్వాలి. నా కుటుంబంతో కలిసి ఈ సినిమా చూస్తా’’ అన్నారు.  

సత్యదేవ్‌ మాట్లాడుతూ–‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీ అన్నది ఓపెన్‌ యూనివర్సిటీ. ఎవరైనా సరే ప్యాషన్‌తో రావాలి.. కష్టపడి నిరూపించుకోవాలి. ఇక్కడ సక్సెస్‌ రేట్‌ అన్నది చాలా తక్కువ. ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చి సక్సెస్‌ అయిన ఎంతో మందిలో నాని అన్న ఒకరు. నాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి’’ అన్నారు.

మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ–‘‘తిమ్మరుసు’ బాగా రావడానికి సపోర్ట్‌ చేసిన వారందరికీ థ్యాంక్స్‌. మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సక్సెస్‌ మీట్‌లో మరింత మాట్లాడతా’’ అన్నారు.  

శరణ్‌ కొప్పిశెట్టి మాట్లాడుతూ–‘‘యూనిట్‌ అంతా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా ఇది. ప్రేక్షకులు మాస్క్‌ ధరించి థియేటర్‌కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ వేడుకలో దర్శకులు వెంకటేశ్‌ మహా (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య), రాహుల్‌(శ్యామ్‌ సింగరాయ్‌), మ్యాంగో మ్యూజిక్‌ రామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top