Nandamuri Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత

Nandamuri Taraka Ratna Passed Away - Sakshi

సాక్షి, బెంగళూరు/అమరావతి/శ్రీకాళహస్తి: నందమూరి తారకరత్న (40) శనివారం రాత్రి కన్ను మూశారు. వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని శనివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న మృతిపై రాష్ట్ర సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

విదేశీ వైద్యులను రప్పించినా..: లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభమైన గత నెల 27న గుండెపోటుకు గురైన తారకరత్నకు సుమారు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగి పోయింది. ఆ సమయంలో రక్తం గడ్డకట్టడంతో మెదడులో ఒకవైపు వాపు వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి బ్రెయిన్‌కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేస్తూ వచ్చారు. తొలుత బెంగళూరు నిమ్హాన్స్‌ ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా వైద్యులను పిలిపించి చికిత్స అందించగా, వారం నుంచి విదేశాల నుంచి ప్రత్యేకంగా న్యూరోసర్జన్లు, న్యూరాలజిస్టులను కూడా రప్పించి చికిత్స అందించారు. అయినప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. మధ్యలో పరిస్థితి కొంచెం మెరుగైందని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్నారనే వార్తలు వచ్చినా, రెండు రోజులుగా పరిస్థితి మరీ క్షీణించడంతో విషమంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం ఆస్పత్రికి చేరుకున్నారు. పూర్తి సమాచారాన్ని వైద్యులు వారికి వివరించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్‌ తొలగించారు. 

ప్రముఖుల సంతాపం
సినీ నటుడు, ఎన్టీఆర్‌ మనవడు నందమూరి తారకరత్న మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తారకరత్న మరణ వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతి, బాధను కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదన్నారు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తారకరత్న మరణంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

పాదయాత్ర ప్రారంభం రోజునే..
నందమూరి తారకరత్న గత నెల 27న కుప్పంలో లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంట ఉన్న నాయకులు ఆయన్ను అక్కడి నుంచి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయనకు పల్స్‌ అందడం లేదని వైద్యులు తెలిపారు. అక్కడే క్రిటికల్‌ కేర్‌ వైద్యం చేశారు. అయితే తారకరత్న గుండెపోటుతో అప్పుడే ప్రాణాలొదిలినా.. లోకేశ్‌ పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు ఆస్పత్రికి తరలించారనే ప్రచారం జరిగింది. లోకేశ్‌కు చెడ్డ పేరు రాకూడదనే ఇన్నాళ్లూ మెరుగైన వైద్యం పేరుతో కథ నడిపించారని టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎట్టకేలకు పర్వదినమైన శివరాత్రి రోజున తారకరత్న శివైక్యం చెందినట్లు ప్రకటించడం గమనార్హం. 

అభిమానుల ఆందోళన
తారకరత్న మరణవార్త విన్న నందమూరి అభిమానులు నారాయణ హృదయాలయకు వందలాదిగా చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వెనుక గేటు నుంచి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. తమకు చివరి చూపు కూడా దక్కకుండా అలా తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ కాసేపు ఆందోళన చేపట్టారు.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top