
గత కొంత కాలంగా భారతీయ నటులు, ముఖ్యంగా దక్షిణాది హీరోలకు జపాన్‌లో బ్రహ్మరధం పడుతున్నారు. ఈ ట్రెండ్‌ని టాప్ లెవల్‌కి చేర్చింది సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అనడం లో సందేహం లేదు. రోబో వంటి సినిమాల ద్వారా ఆయనకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ద్వారా జూ.ఎన్టీయార్ వంటి టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా జపాన్ సినీ అభిమానుల మనసుల్లో ప్రత్యేక అభిమానం సంపాదించారు.
ప్రస్తుతం వీరి సినిమాల కలెక్షన్లు అక్కడ భారీ స్థాయిలో ఉంటున్నాయి. అదే క్రమంలో ప్రస్తుతం జపాన్‌లో మరో హీరో కూడా స్థానికుల ఆదరణ పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు... తెలుగు సీనియర్ స్టార్, కింగ్, అక్కినేని నాగార్జున. ఇటీవల ఆయన జపాన్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు, అంతేకాదు అక్కడ ఆయనను ప్రత్యేకమైన పేరుతో పిలుచుకుంటున్నారు. అక్కడి అభిమానులు నాగార్జునను ’నాగ్–సామ’ అని ఇష్టంగా పేర్కొంటున్నారు.
ఇటీవల నాగార్జున నటించిన పలు చిత్రాలు జపాన్ ప్రేక్షకులకు ఆయనను దగ్గర చేశాయి. ముఖ్యంగా హిందీలో రూపొందిన బ్రహ్మాస్త్ర లో నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అదే విధంగా తాజాగా విడుదలై సూపర్ హిట్ అయిన కుబేరా సినిమాలో నాగార్జున చేసిన కీలక పాత్ర కూడా అక్కడి వారి ఆదరణ చూరగొంది. దాంతో జపాన్‌లో అభిమానులను దక్కించుకున్న భారతీయ నటుల సరసన నాగార్జున కూడా చేరారు.

జపాన్ సంస్కతిలో, దేవుళ్ళు, రాజవంశం లేదా గొప్ప స్థాయి వ్యక్తులు వంటి ఉన్నత గౌరవం ఉన్న వ్యక్తులకు ‘సామ‘ అనేది వారి స్థాయికి అందించే గౌరవంగా ఉపయోగిస్తారు. నాగార్జున పట్ల అభిమానాన్న చూపడానికి జపనీస్ అభిమానులు ఈ పదాన్ని ఎంచుకోవడం ద్వారా సరిహద్దులకు ఆవలన నాగార్జునకు గొప్ప గౌరవాన్నే అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో త్వరలో రానున్న కూలీ జపాన్‌లో ఎన్ని సంచలనాలు రేకెత్తిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా తొలిసారి నాగార్జున విలన్‌గా కనిపించనున్నారు. అంటే అది కూడా ఆయన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన పాత్రగానే చెప్పాలి. మరోవైపు అదే సినిమాలో జపాన్‌లో మంచి ఇమేజ్ ఉన్న రజనీకాంత్ హీరోగా వస్తున్నారు. దీంతో.... ఈ ప్రాజెక్ట్ ఇటు ఇండియాతో పాటు జపాన్‌లో కూడా క్రేజీగా మారిందని చెప్పొచ్చు.