ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ | Mollywood Times Movie Review Telugu | Sakshi
Sakshi News home page

Mollywood Times Review: ఇండస్ట్రీ అసలు స్వరూపం బయటపెట్టిన మూవీ.. ఎలా ఉందంటే?

Jul 8 2026 3:39 PM | Updated on Jul 8 2026 4:11 PM

Mollywood Times Movie Review Telugu

ఓటీటీల్లో రిలీజయ్యే మలయాళ డబ్బింగ్ సినిమాలకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకు తగ్గట్లే డిఫరెంట్ థ్రిల్లర్, కామెడీ చిత్రాలు ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్‌లోకి వస్తుంటాయి. అలా రీసెంట్‌గా హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చిన సైకలాజికల్ డార్క్ కామెడీ మూవీ 'మాలీవుడ్ టైమ్స్'. 'ప్రేమలు' ఫేమ్ నస్లేన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఈ సిరీస్ చూశాక ఫోన్ వాడాలంటే భయపడతారు.. తెలుగు రివ్యూ)

కథేంటి?
వినీత్ మాధవన్ (నస్లేన్).. చిన్నప్పటి నుంచి హారర్ పుస్తకాలు చదువుతూ ఎప్పటికైనా గొప్ప హారర్ ఫిలిం మేకర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఓ హారర్ షార్ట్ ఫిల్మ్ తీసి ఇంట్లో వాళ్లకు చూపించి భయపెడతాడు. తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్ పోటీలో పాల్గొని అందులో సెకండ్ ప్రైజ్ సొంతం చేసుకుంటాడు. అలా కొన్నాళ్లకు ఇండస్ట్రీలోకి వస్తాడు. మరి తన పంతం, ఇగో వల్ల ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? చివరకు తను అనుకున్నట్లు గొప్ప దర్శకుడు అయ్యాడా లేదా? ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
తెలుగులో చాలా ఏళ్ల క్రితం 'నేనింతే', 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు' అని టాలీవుడ్ గురించి తీసిన సినిమాలు వచ్చాయి. ఇవి రెండూ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిలయ్యాయి. ఇందులో 'నేనింతే' కొందరికి నచ్చొచ్చేమో గానీ ఇవి అందరికీ నచ్చే మూవీస్ అయితే కావు. ఎందుకంటే ఇండస్ట్రీలోని కష్టాల్ని, బాధల్ని ఇందులో చూపించారు. సగటు ప్రేక్షకుడికి ఇవేం అక్కర్లేదు! తెరపై ఓ సినిమాతో ఎంటర్‌టైన్ చేశారా లేదా అనేది మాత్రం చూస్తాడు. కానీ సినిమా తీయడం వెనుకున్న కష్టాలు కూడా చూపిద్దామనుకుంటే చూసే ఓపిక అందరికీ ఉండకపోవచ్చు. 'మాలీవుడ్ టైమ్స్' విషయంలోనూ ఇదే జరిగింది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఓ కుర్రాడు.. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టనష్టాల్ని చవిచూశాడు అనేది సింపుల్‌గా స్టోరీ లైన్. 2 గంటల 47 నిమిషాల నిడివితో సహనానికి విపరీతమైన పరీక్ష పెట్టారు. మూవీ మొదలైన తర్వాత తొలి 20 నిమిషాలు చూస్తే ఏదో కొత్తగా ఉండబోతుందే అనిపిస్తుంది కానీ తర్వాత ఉండే సాగదీత వల్ల ఓ దశలో చిరాకొచ్చేస్తుంది.

చాలా సినిమాల్లో కష్టపడితే సక్సెస్ సులభంగా వస్తుందన్నట్లు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో ప్రతిభ ఒక్కటే పనికిరాదు. ఇండస్ట్రీలో ఉండే రాజకీయాలు, బడ్జెట్ పరిమితులు, నిర్మాతల ఈగోలు.. ఇవన్నీ దాటుకుని ఒక మూవీ తీయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇలా సినీ పరిశ్రమలోని సమస్యలను డార్క్ కామెడీ యాంగిల్‌లో చూపించే ప్రయత్నం చేశారు. కానీ అది అక్కడక్కడ మాత్రమే వర్కౌట్ అయింది.

సినిమా పిచ్చిలో పడిన ఓ కుర్రాడు తనకున్న జాలి, మానవత్వం లాంటివి గాలికి వదిలేసి ఓ రకమైన సైకోలా ఎలా మారాడనేది రియలిస్టిక్‌గా చూపించారు. కాకపోతే అది కొంతవరకు పర్లేదనిపించింది. సినిమా ఇండస్ట్రీ గురించి కాస్తోకూస్తో తెలిసి, ఈ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న వాళ్లకు ఇది నచ్చొచ్చేమో గానీ సగటు ప్రేక్షకుడికి నచ్చుతుందా అంటే డౌటే. నిడివి కూడా పెద్ద సమస్య. ఓ 20 నిమిషాలు తగ్గిస్తే బాగుండేది. ఈ మూవీ తీసిన దర్శకుడు అభినవ్ సుందర్ నాయక్.. తనకెదురైన ఇండస్ట్రీ కష్టాల్ని చూపించడం కోసం ఏమైనా ఈ చిత్రాన్ని తీశాడా అని సందేహం కూడా కలుగుతుంది.

అన్ని మైనస్‌లేనా ప్లస్సులేం లేవా అంటే ఉన్నాయి. వినీత్‌కి సినిమాపై ఆసక్తి కలగడానికి కారణమైన థియేటర్‌లో డీటీఎస్ అనుభవానికి చాలామంది 90స్ కిడ్స్ రిలేట్ అవ్వొచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కొందరు నిర్మాతలు కావాలనే ఎందుకు ఫ్లాప్ సినిమాలు తీస్తారు? కథనే కాకుండా స్టైల్‌ని కూడా కొందరు దర్శకులు.. మిగతా వాళ్ల నుంచి ఎలా కాపీ కొడతారు? లాంటి సీన్స్ బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే నస్లేన్ బాగా చేశాడు. ఇతర పాత్రల్లో సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్, వినీత్ శ్రీనివాసన్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెట్ వర్క్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ కష్టాలు చూద్దామనే ఆసక్తి ఉండి, చాలా టైమ్ ఉంటే దీన్ని చూడండి. లేదంటే లైట్ తీసుకోండి. అసభ్యకర సీన్స్ ఏం లేవు కాబట్టి కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: పలు దేశాల్లో నిషేధం.. సిటిజన్ విజిలాంట్ సినిమా తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement