
హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీలను మీరు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. మిస్ వరల్డ్ అవ్వాలనే కోరికతో జాతీయ స్థాయిలోనే ఏటా పదిలక్షలకు పైగా అమ్మాయిలు దరఖాస్తు చేసుకుంటారు. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా 150కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇలా ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ పోటీలు ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతుండటంతో ప్రత్యక్షంగా చూడాలని చాలామందిలో ఆసక్తి పెరుగుతుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism) పేర్కొంది. అందాల పోటీలను చూడాలని ఆసక్తి ఉన్నవారు టూరిజం శాఖ అధికారిక వెబ్సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఒక మెయిల్ పంపుతామని వారు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://tourism.telangana.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. అందుకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, బుక్‌మైషో ద్వారా డబ్బుల చెల్లించి ఎంట్రీ పాసులు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంది.