
విజువల్ వండర్‌గా తెరకెక్కిన మిరాయ్ సినిమా (Mirai Movie)కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. థియేటర్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. సెప్టెంబర్ 12న రిలీజైన ఈ మూవీ తొలి రోజు రూ.27.20 కోట్లు రాబట్టిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించాడు. శనివారం (సెప్టెంబర్ 13) ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
రుణపడి ఉంటా..
ఇలాంటి సక్సెస్ మీట్‌లో పాల్గొని చాలాకాలమైందంటూ మనోజ్ (Manchu Manoj) భావోద్వేగానికి లోనయ్యాడు. సక్సెస్ వేదికపై నిలబడ్డందుకు సంతోషంగా ఉంది. దాదాపు 10-12 ఏళ్ల తర్వాత నా ఫోన్ మోగుతోంది. అందరూ సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. కానీ, నాకు చాలాకాలమైంది. నిన్నటినుంచి అందరూ ఫోన్లు చేసి విషెస్ చెప్తుంటే అంతా కలలాగే ఉంది. దర్శకుడు కార్తీక్ ఏం ఆలోచించుకుని కథ రాసుకున్నారో కానీ నాకోసం ఓ పాత్ర రాసుకుని అడిగారు. అందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
కమ్‌బ్యాక్ ఎప్పుడని అడిగేవారు
ఈ సినిమా నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని కార్తీక్ నాకు చెబుతూ ఉండేవాడు. ఆ మాట చాలనుకున్నాను. ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతూ ఉండేవాడిని. అప్పుడు సోషల్ మీడియాలో.. అన్నా, కమ్‌బ్యాక్ ఎప్పుడు? సినిమా చేయు, నీకు హిట్టు పడాలి, కమ్‌బ్యాక్ ఇవ్వు అని అడుగుతూ ఉండేవారు. వస్తున్నాను తమ్ముడు, త్వరలోనే చేస్తాను అనేవాడిని. బయటకు ధైర్యంగా మాట్లాడినా లోపల మాత్రం ఏదో తెలియని భయం ఉండేది. చాలా సినిమాలు దగ్గరివరకు వచ్చి వెళ్లిపోయాయి. ఒకటనుకుంటే ఇంకోటి జరిగేది.
నా కుటుంబాన్ని నిలబెట్టారు
ఇలాంటి సమయంలో డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్ నన్ను నమ్మారు. కార్తీక్‌లాంటి దర్శకుడు, టెక్నీషియన్‌ను నా జీవితంలో చూడలేదు. మిమ్మల్ని దగ్గరినుంచి చూసినందుకు సంతోషంగా ఉంది. మీరు నన్నొక్కడినే కాదు, నా కుటుంబాన్ని సైతం నిలబెట్టారు. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కానీ నాలో ఓ భయం ఉండేది. నేను పెరిగినట్లుగా నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా? వాళ్లను బాగా చూసుకోగలుగుతానా? అని రోజూ భయపడేవాడిని. ఆ భయాన్ని మీరు చంపేశారు. నేను గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి పాదాలకు నా వందనం అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: డేంజర్ జోన్‌లో ఉన్నది వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?