
తేజ సజ్జా, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా, మంచు మనోజ్ మరో ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మంచు మనోజ్ చెప్పిన విశేషాలు.
⇒ తేజ చిన్నప్పట్నుంచి నాకు తెలుసు. క్యూట్‌గా ఉండేవాడు... బుగ్గలు గిల్లేసేవాడిని. ఓ సందర్భంలో మంచి స్క్రిప్ట్ ఉంటే చెప్పు తమ్ముడూ సినిమా చేద్దామని అన్నాను. ‘నిజమా? అన్నా’ అని ‘మిరాయ్’ గురించి చెప్పాడు. దర్శకుడు కార్తీక్‌గారు కథ చెప్పారు. నచ్చి, ఈ సినిమా చేశాను.
⇒ ‘మిరాయ్’లో పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశాను. వారసత్వం, లేజీనెస్‌ని ఏ మాత్రం సహించని క్యారెక్టర్ నాది. కథ రీత్యా తొమ్మిది గ్రంథాలు నా దగ్గరకు వస్తే, నా తలతో కలిసి పది తలల రావణుడిని అవుతాను. వాటి కోసం ఏం చేశాను? అన్నదే కథ. ఒక రకంగా మోడ్రన్ రావణాసురుడు అని చెప్పుకోవచ్చు. కానీ ఆడవాళ్ల జోలికి వెళ్లడు. దర్శకుడు నా క్యారెక్టర్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారు. ‘మిరాయ్’ నాకు మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది.
⇒ ‘మిరాయ్’ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. శ్రీరాములవారి ప్రస్తావన, 9 పుస్తకాల బ్యాక్‌డ్రాప్, ఇతిహాస కోణాలు... ఇవన్నీ బాగుంటాయి. ఈ సినిమా కోసం తేజ చేసిన హార్డ్‌వర్క్ మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మేమిద్దరం డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేశాం. హైదరాబాదులో జాక్సన్ మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ఉన్న బడ్జెట్‌లోనే కార్తీక్‌గారు హాలీవుడ్ స్థాయి సినిమా తీశారు.
విశ్వప్రసాద్ రాజీ పడకుండా నిర్మించారు. ఇక ‘కూలీ’ సినిమాకు ముందు మా ఇంట్లో రజనీకాంత్‌గారిని కలిశాను. ‘మిరాయ్’ ట్రైలర్ చూశారు. ఆయనకు నచ్చింది. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకు ఎనర్జీనిచ్చాయి. ఇక గ్యాప్ లేకుండా సినిమాలు చేయమని రజనీకాంత్ గారు క్లాస్ తీసుకున్నారు.
⇒ ‘డేవిడ్ రెడ్డి, రక్షక్’ సినిమాలు చేస్తున్నాను. ఇంటెన్స్ యాక్షన్ చిత్రాలు ఇవి. ఇక ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రం రావాల్సినప్పుడు వస్తుంది. అలాగే డార్క్ కామెడీ ఫిల్మ్ ‘వాట్ ద ఫిష్’ ఎప్పుడొచ్చినా చాలా బాగుంటుంది. కామెడీ చిత్రాలు చేయాలని ఉంది. కథల కోసం చూస్తున్నాను. ‘నేను మీకు తెలుసా’ టీమ్‌తో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. నటుడిగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనుకుంటున్నాను... కథలు వింటున్నాను.