
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది. చిరంజీవి, నయనతారలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇదే స్టూడియోలో మరో కాంప్లెక్స్‌లో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సినిమాలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూట్‌లో భాగంగా విజయ్ సేతుపతి, టబుతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు పూరి. రెండు సినిమాల షూటింగ్స్ ఒకే స్టూడియోలో జరుగుతుండటంతో షాట్ గ్యాప్‌లో ‘మన శంకరవరప్రసాద్ గారు’ యూనిట్‌ని కలిసి, సందడి చేసింది పూరి అండ్ టీమ్. ఇక ‘మన శంకరవర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే విజయ్ సేతుపతి– పూరి జగన్నాథ్ చిత్రం కూడా 2026 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.