టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)తో మరో కన్నడ బ్యూటీ బిగ్ ఛాన్స్ దక్కించుకుంది. పీవీసీయూలో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’.. ఇదే యూనివర్స్లో ‘మహాకాళి’ మూవీ రానుంది. ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. మహాకాళిగా కనిపించనున్న భూమి శెట్టి (27) గురించి తెలుసుకునేందుకు కొందరు నెటిజన్లు సోషల్మీడియాలో వెతుకుతున్నారు.

ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి జన్మించిన కుందాపుర గ్రామమే భూమి శెట్టిది కూడా.. భాస్కర్, బేబీ శెట్టి దంపతులకు జన్మించిన భూమి కన్నడ, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో యక్షగానం (నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత) నేర్చుకుంది. కుందాపురలోనే తన పాఠశాల విద్యను భూమి పూర్తి చేసింది. దగ్గర్లోనే ఉన్న ఆర్.ఎన్. శెట్టి పి.యు. కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తరువాత బెంగళూరులోని AMC ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైంది.
చిన్నప్పుడే యక్షగానంలో శిక్షణ పొందడంతో రంగస్థలంపై రాణించాలనే ఆసక్తి ఆమెలో ఉండేది. అలా మొదట కన్నడ సీరియల్ కిన్నరితో కెరీర్ ప్రారంభించిన భూమి... తెలుగు సీరియల్ నిన్నే పెళ్లాడతాలో ప్రధాన పాత్రలో మెరిసింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ కన్నడ సీజన్- 7 టాప్ ఫైవ్‌లో నిలిచింది. బిగ్బాస్తో వచ్చిన గుర్తింపుతో ఆమెకు సినిమా ఛాన్స్ వచ్చింది. కన్నడ చిత్రం ఇక్కత్ (2021)తో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన కింగ్డమ్ చిత్రంలో సత్య దేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించింది. ఇప్పుడు, మహాకాళితో భూమి శెట్టికి బిగ్ ఛాన్స్ వచ్చింది.


