
– గీత రచయిత శ్రీమణి
‘‘ఇటీవల సంగీతంలో సౌండ్ డిజైనింగ్ మారింది. ఈ సౌండ్‌కు తగ్గట్లుగా సాహిత్యం కూడా మారుతూ వస్తోంది. పదేళ్ల తర్వాత మన పాట విన్నా మంచి సాహిత్యం రాశారు అనిపించేలా నా పాటల ద్వారా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాను’’ అని తెలిపారు గీత రచయిత శ్రీమణి. ‘100 పర్సెంట్ లవ్’ సినిమాతో గీత రచయితగా పరిచయమైన శ్రీమణి దశాబ్ద కాలానికి పైగా రాణిస్తున్నారు.
నేడు (సోమవారం) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆదివారం శ్రీమణి తన కెరీర్ జర్నీ గురించి మాట్లాడుతూ – ‘‘ఇటీవల ‘తండేల్’ చిత్రంలో ‘బుజ్జి తల్లి, హైలెస్సా’ పాటలతో పాటు ‘లక్కీ భాస్కర్’లోని ‘నిజమా కలా’, ‘ఆయ్’ సినిమాలోని పాట నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఈ పాటలన్నీ కథలో ఉన్న సన్నివేశం తాలూకు లోతైన భావం చెప్పడమే. నేనీ పాటలు రాయగలనని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులకు, దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు.
ఇక ప్రేమ పాటలు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి కొత్త ఎక్స్‌ప్రెషన్‌తో రాయగలను అనేది, అలాగే హీరో ఎలివేషన్ సాంగ్ వచ్చినప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ ఓ డిఫరెంట్ కోణంలో ఎలా చెప్పగలను? అనేది ఛాలెంజ్ అవుతుంది. ఇలా ప్రతి పాటా ఓ సవాలే. నన్ను గీత రచయితగా పరిచయం చేసిన దర్శకుడు సుకుమార్‌గారు ‘గీత గోవిందం’ సినిమాలో ‘వచ్చిందమ్మా పాట..’ను మెచ్చుకున్నారు.
మహేశ్‌బాబుగారి ‘మహర్షి’లోని పాటలు విని, ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు అభినందించారు. ‘రంగ్ దే’లోని ‘ఊరంతా..’, ‘మహర్షి’లోని ‘ఇదే కదా..’, ‘ఉప్పెన’ లోని ‘నీ కళ్లు నీలి సముద్రం..’ పాటలను దేవిశ్రీ ప్రసాద్ మెచ్చుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ ‘ఆకాశంలో ఓ తార’, సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలకు సాహిత్యం అందిస్తున్నాను’’ అన్నారు.