
సాధారణంగా కొరియోగ్రాఫర్స్ అనగానే దాదాపు తెర వెనకే ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపిస్తుంటారు. కానీ ఇతడు మాత్రం ఓవైపు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు సైకో విలన్‌గా తెగ భయపెడుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో సైకో పాత్రలతో క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. ఇంతకీ ఎవరితడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
శాండీ మాస్టర్ అలియాస్ సంతోష్ కుమార్.. తమిళ ఇండస్ట్రీకి చెందిన కొరియోగ్రాఫర్ కమ్ నటుడు. చెన్నైకి చెందిన ఇతడు.. 2005లో డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. తెలుగులోనూ ఓంకార్ హోస్ట్ చేసిన ఛాలెంజ్ షోలో కొరియోగ్రాఫర్‌గా చేశాడు. రీసెంట్ టైంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మోనికా' పాటకు ఇతడే స్టెప్పులు కంపోజ్ చేశాడు. అంతకు ముందు విక్రమ్, థగ్ లైఫ్, ఆవేశం, తంగలాన్ తదితర సినిమాలకు పనిచేశాడు.
(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)

ఇక నటన విషయానికొస్తే.. లోకేశ్ కనగరాజ్ 'లియో' సినిమా ప్రారంభంలో చాక్‌లెట్ కాఫీ అంటూ నవ్వుతూనే భయపెట్టి సైకో విలన్‌గా చేసింది ఇతడే. ఈ మూవీతో చాలా క్రేజ్ వచ్చింది. అలా రీసెంట్ మలయాళ హిట్ 'లోక: ఛాప్టర్ 1'లోనూ నాచియప్ప అనే ప్రతినాయక పాత్ర చేశాడు. తాజాగా రిలీజైన తెలుగు మూవీ 'కిష్కింధపురి'లోనూ విస్త్రవ పుత్ర అనే సైకో పాత్ర చేశాడు. రీసెంట్ టైంలో ఇలా వరసగా సైకో పాత్రలే చేస్తున్నాడు గానీ ప్రతిసారి తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు.
ప్రస్తుతం శాండీ మాస్టర్ మలయాళ సినిమాలైన 'కథనార్', 'బాబాబా'ల్లో లీడ్ రోల్స్ చేస్తుండటం విశేషం. ఇలా ఓవైపు కొరియోగ్రాఫీ చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. మరోవైపు విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని భయపెడుతూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. శాండీ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తమిళ నటి కాజల్ పశుపతిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మూడేళ్లకే వీళ్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ దొరతి స‍్లవియాని వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు.
(ఇదీ చదవండి: 'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్)
