
తమిళ నటుడు సంతానంకు తిరుపతికి చెందిన ఓ బీజేపీ నేత నోటీసులు పంపారు. సంతానం కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్’ నిహారిక ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ, ఆర్యకు చెందిన షో పీపుల్ సంస్థ కలిసి నిర్మించిన చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈచిత్రంలో శ్రీ వేంకటేశ్వరభక్తి గీతాలు శ్రీనివాస గోవిందా అనే పాటను పొందుపరిచారు. ఈ పాటలో నటుడు సంతానం నటించారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే శ్రీవేంకటేశ్వరస్వామి భక్తి గీతాన్ని డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవెల్ చిత్రంలో పొందుపరిచి భక్తుల మనోభావాలను గాయపరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అదేవిధంగా తిరుమల, తిరుపతి పోలీస్‌స్టేషన్లలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు సంతానంపై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గానికి చెందిన ఓ బీజేపీ నేత దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ చిత్ర విడుదలను నిషేధించాలని, ఆ చిత్రంలో భక్తి గీతాన్ని తొలగించాలని, ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్ చానళ్ల ద్వారా భక్తుల్లోకి వెళ్లి వారి మనోభావాలను గాయపరిచినందుకుగాను నష్టపరిహారం చెల్లించాలని సంతానానికి, నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టెయిన్‌మెంట్‌కు నోటీసులు పంపారు. నోటీసులపై 15 రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.