
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్ 2’. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్‌లో రిలీజై మంచి టాక్‌ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై మే 23న ఇది తెలుగులో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు. 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న జలియన్‌వాలా బాగ్‌లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది.
అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్‌పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్‌వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్‌కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్‌రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్‌పై కోర్ట్‌లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు.
డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్‌కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్‌కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్‌రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే?
శతాబ్దం క్రితం భారత్‌లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్ 2’ చిత్రం అవుతుంది. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్ చేసిన న్యాయ పోరుని హైలెట్ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న శంకరన్ ఆ సాహసం చేశాడు.
దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్ సింగ్ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్, మెక్‌కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి.
జలియన్‌వాలాబాగ్ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్ నేపథ్యం, కమీషన్ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్ డయ్యర్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్‌లో శంకరన్ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్‌కి పోటీగా డయ్యర్ తరపున మెక్‌కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం కోర్ట్‌లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్.
ఎవరెలా చేశారంటే..
సర్ శంకరన్ నాయర్‌గా అక్షయ్ కుమార్ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్‌లో ఆయన చేప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న మెక్ కిన్లేగా ఆర్ మాధవన్ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్‌రీత్ గిల్‌గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్ సచ్‌దేవ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్