Kausar Munir: బాట చూపే పాట.. కౌసర్‌ మునీర్‌

Kausar Munir: Indian Female lyricist And Screen Writer in Bollywood - Sakshi

‘బాలీవుడ్‌లో పదిమంది పాటల రచయితల పేర్లు చెప్పండి?’ అని అడిగితే ‘పదేం ఖర్మ పాతిక పేర్లు చెబుతాం’ అంటాం. ‘ఫిమేల్‌ లిరిసిస్ట్‌ల పేర్లు చెప్పండి?’ అంటే మాత్రం నీళ్లు నములుతాం. ఇలాంటి సమయంలో కౌసర్‌ మునీర్‌ లాంటి లిరిసిస్ట్‌లను ఒకసారి పరిచయం చేసుకుంటే కొత్తదారి కనిపించే స్ఫూర్తి కచ్చితంగా దొరుకుతుంది. ఇంగ్లీష్‌ సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది కౌసర్‌ మునీర్‌.

నానమ్మ సల్మా సిద్దికీ ఉర్దూ రచయిత్రి. భాషలోని సొగసు ఏమిటో ఆమె ద్వారా తెలుసుకుంది. నాన్న ఒక ఫిల్మ్‌స్టూడియోలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్‌. ఆయన నుంచి మంచి మంచి సినిమాల గురించి తెలుసుకుంది. సినిమాలు చూడడం కంటే అందులో పాటలు వినడం ఆమెకు ఇష్టం. జావెద్‌సాబ్‌ పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో!

వినగా వినగా పదాల గురించి లోతైన పరిచయం ఏర్పడింది. ఇక అప్పటి నుంచి తాను కూడా పాట రాయాలనే తపన మొదలైంది. సినిమాలలో ఎన్నో సందర్భాలను ఊహించుకొని వాటికి తగ్గట్టు పాటలు రాసుకొని మురిసిపోయేది. కాని ఎన్నాళ్లు ఇలా తనకు తాను మురిసిపోవడం!

‘సినిమాలో ఫీల్డ్‌కు వెళ్లి పాటలు రాయాలని ఉంది’ అని తన మనసులో మాటను సన్నిహితుల దగ్గర చెప్పినప్పుడు నవ్వనివారు తక్కువ.

‘డైరెక్టర్‌ కావాలనుకుంటారు లేదా కొరియోగ్రాఫర్‌ కావాలనుకుంటారు. పాటలు రాయడం ఏమిటీ!’ అని ఆశ్చర్యపోయేవారు.

ఒక టీవీ సీరియల్‌కు అసిస్టెంట్‌ రైటర్‌గా పనిచేసిన కౌసర్‌కు మంచి ప్రశంసలు లభించాయి. మరిన్ని సీరియల్స్‌కు అసిస్టెంట్‌గా అవకాశాలు వచ్చినా వాటిని నిరాకరించింది. దీనికి కారణం తన మనసులో కోరిక... పాటలు రాయాలని.

డైరెక్టర్‌ విజయ్‌కృష్ణ ఆచార్యను కలిసి తన మనసులో మాట చెప్పింది.

ఇంతకుముందే రచయిత్రిగా తనను తాను నిరూపించుకోవడం వల్ల ఆచార్యను నమ్మించడం పెద్ద కష్టం కాలేదు. అలా ‘తషాన్‌’ సినిమాలో పాట రాసే అవకాశం వచ్చింది.

‘ఫలక్‌తక్‌ ఛల్‌ సాత్‌ మేరే
ఫలక్‌తక్‌  ఛల్‌ సాత్‌ ఛల్‌
యే బాదల్‌ కీ చాదర్‌
యే తారోం కీ ఆంచల్‌’... అనే ఆ పాట అందరినీ ఆకట్టుకుంది. అవార్డ్‌లు తెచ్చిపెట్టింది. ఇక వెనక్కి తిరిగిచూసుకోనక్కర్లేదు, అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయి అనుకుంది. కానీ అదేమీ జరగలేదు. మళ్లీ సినిమా ఆఫీస్‌ మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. అలా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ‘ఇష్క్‌జాదే’లో పాట రాసే అవకాశం వచ్చింది.

‘ఆడియో ఇండస్ట్రీలో స్త్రీలను చిన్నచూపు చూస్తారనేది అపోహ కాదు. వాస్తవం. అలా అని వెనక్కితగ్గితే వారికి బలాన్ని ఇచ్చినట్లవుతుంది’ అంటున్న కౌసర్‌ మునీర్‌ బజ్‌రంగీ భాయిజాన్, డియర్‌ జిందగీ, సీక్రెట్‌ సూపర్‌స్టార్, గుంజనా సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌... మొదలైన సినిమాలలో పాటలు రాసి తన బలమేమిటో నిరూపించుకుంది. ఇండస్ట్రీకి వచ్చి పాటలు రాయాలనుకునే మహిళలకు ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top