
స్వాతి ముత్తిన మాలే హానియే, టోబీ చిత్రాల సక్సెస్ తర్వాత కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. గురుదత్ గనిగ దర్శకత్వంలో 'కరవాలి' సినిమా చేస్తున్నారు.. విజువల్ వండర్‌గా రాబోతోన్న ఈ ‘కరవాలి’ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా.. రాజ్ బి. శెట్టి మవీర అనే పాత్రలో కనిపించనున్నారు. “జంతువు vs మానవుడు” అనే ట్యాగ్‌లైన్.
ఇప్పటికే ‘కరవాలి’ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ‘కరవాలి’ నుంచి ‘మవీర ఆగమనం’ అంటూ రాజ్ బి శెట్టి పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో రాజ్ బి శెట్టి ఓ సూపర్ మెన్ తరహా పాత్రను పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రెండు గంభీరమైన గేదెల పక్కన నిలబడి ఉన్న తీరు, చేతిలోని ఆ కాగడ చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయనిపిస్తోంది.
దర్శకుడు గురుదత్ గనిగ మాట్లాడుతూ.. ‘మేము సినిమా కథ రాసినప్పుడు, తీస్తున్నప్పుడు కూడా ఈ పాత్రను ఎవరు పోషిస్తారో తెలియదు. మొదటి టీజర్ విడుదల చేసిన తర్వాత అనూహ్యమైన స్పందన వచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను మరింత గొప్పగా తీయాలనుకున్నాం. ఈ పాత్ర కోసం మేం చాలా మంది నటులను ప్రయత్నించాం. వారికి ఆ పాత్ర నచ్చింది, కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ సినిమా తీర ప్రాంత ఆచారాల నేపథ్యంలో రానుంది. ఈ పాత్ర గొప్పదనాన్ని అర్థం చేసుకునే నటుడే కావాలని మేం కోరుకున్నాం.
నేను రాజ్‌ను కలిసి కథను వివరించాను. కానీ అతను అనేక కమిట్‌మెంట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిలో ‘సు ఫ్రమ్ సో’ అనే సినిమా కూడా ఉంది. అయినా సరే నేను ఆయన్ను వదల్లేదు. ఐదు సమావేశాల తర్వాత అతను ‘మీకు అభ్యంతరం లేకపోతే, మీరు చిత్రీకరించిన కొన్ని భాగాలను చూడవచ్చా?' అని అడిగారు. నేను అందుకు అంగీకరించాను. ఆయన ఫుటేజ్ చూసిన తర్వాత వెంటనే ఒప్పుకున్నారు. చివరకు ఆయన మవీర అనే పాత్రకు ప్రాణం పోశారు’ అని తెలిపారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
చదవండి: కమల్ హాసన్ కాలి ధూళితో కూడా షారూఖ్ సరిపోడు: నటుడు