నాలుగోసారి అవార్డు: ఫుల్‌ ఖుషీలో బాలీవుడ్‌ ఐరన్‌ లేడీ

Kangana Ranaut Reacts Her Fourth National Award - Sakshi

అష్టకష్టాలు పడి సినీ పరిశ్రమకు వచ్చి హీరోయిన్‌గా సుస్థిర స్థానం సంపాదించుకున్న కంగనా రనౌత్‌ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది. ఆమె నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె ఇంటికి అవార్డులు పరుగెత్తుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా ప్రకటించిన జాతీయ సినిమా అవార్డుల్లో నాలుగోసారి ఉత్తమ నటిగా కంగనా అవార్డు దక్కించుకుంది.

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కంగనా రనౌత్‌ ముంబైలో స్థిరపడడానికి ఎంతో కష్టపడింది. తనలోని నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూనే కథలకు కూడా కంగనా పెద్దపీట వేస్తుంటుంది. హీరోకు పోటీగా తన పాత్ర ఉండేలా చూసుకుంటోంది. ఈ విధంగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు కంగనా కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె నటనకు మెచ్చి జాతీయ అవార్డులతో పాటు ఇతర అవార్డులు ఆమెను వరిస్తున్నాయి.

మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో ‘ప్యాషన్‌’ సినిమాలో నటించగా కంగనాకు తొలిసారి జాతీయ ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. అనంతరం ‘క్వీన్‌’ సినిమాతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డు తొలిసారి సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’ సినిమాకు రెండోసారి జాతీయ ఉత్తమ నటిగా కంగనా నిలిచింది. ఇప్పుడు మణికర్ణిక, పాంగా సినిమాల్లో నటనకు గాను ఆమెకు మరోసారి భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటిగా గుర్తించి అవార్డు ప్రకటించింది. వీటితో కలిపి మూడుసార్లు ఉత్తమ నటిగా, ఒకసారి ఉత్తమ సహాయ నటిగా కంగనా అవార్డులు సొంతం చేసుకుంది. అవార్డు వచ్చిన సందర్భంగా ట్విటర్‌లో కంగనా స్పందించారు. తనను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. 

జాతీయ అవార్డులు
2008 ప్యాషన్‌ (సహాయ నటి)
2014 క్వీన్‌
2015 తను వెడ్స్‌ మను రిటర్న్స్‌
2021 మణికర్ణిక, పాంగా

కంగనా సినిమాలతో పాటు దేశంలో జరిగే పరిణామాలపై తరచూ స్పందిస్తుంటింది. ఆమెపై రాజకీయ వివాదాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం గతంలో పద్మశ్రీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు ఎన్నో సొంతం చేసుకోగా.. ఫోర్బ్స్‌ జాబితాలో టాప్‌ 100లో కంగనా చోటు సంపాదించుకుంది. 

చదవండి: జాతీయ అవార్డులు: దుమ్మురేపిన మహేశ్‌బాబు, నాని
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top