
చాలామందికి చిన్నతనంలో అమ్మ కంటే అమ్మమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం. ఆమె చేసే గారాబం, చూపించే ప్రేమకు అసలు తనను వదిలి వెళ్లబుద్ధి కాదు. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol)కు కూడా అమ్మమ్మ అంటే బోలెడంత ఇష్టం. తనకోసం చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.
11 ఏళ్ల వయసులో సాహసం
నేను బోర్డింగ్ స్కూల్‌లో చదివాను. ఓసారి మా అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. అప్పుడు నా వయసు 11 ఏళ్లు. అమ్మకు ఫోన్ చేస్తే.. నాకు ఎగ్జామ్స్ ఉన్నందున ఇంటికి రావొద్దని చెప్పింది. డిసెంబర్‌లో సెలవులు ఇస్తారు కదా.. అప్పుడు ఇంటికి రావొచ్చులే అంది. నాకేమో అమ్మమ్మ గురించి తెలిశాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. అప్పటికే నా స్నేహితురాలు కూడా ఎందుకో బాధగా ఉంది. దీంతో మేమిద్దరం స్కూల్ నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నాం. ఎలాగైనా ముంబై వెళ్లిపోవాలనుకున్నాం.

అమ్మ ఫోన్ చేసిందని అబద్ధం
నేను చదువుకుంటున్న టౌన్ పంచంగిలో మా చుట్టాలున్నారు. అలా మా మామయ్యను కలుసుకుని.. 'అమ్మ నాకు ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. నన్ను బస్టాండ్‌కు తీసుకెళ్లు' అని చెప్పాను. ఆయన నిజమని నమ్మి నన్ను బస్టాప్‌కు తీసుకెళ్లాడు. అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది.. ఇక ఇంటికి వెళ్లిపోవచ్చు అనుకునే సమయంలో ప్లాన్ రివర్స్ అయింది. బస్ కోసం ఎదురుచూస్తుండగా స్కూల్‌లో పనిచేసే నన్స్.. నన్ను, నా ఫ్రెండ్‌ను వెతుక్కుంటూ వచ్చారు. నా చెవులు మెలేస్తూ తిరిగి స్కూల్‌కు తీసుకెళ్లారు అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
దూరాన్ని లెక్క చేయకుండా..
కాజోల్ పంచంగి పట్టణంలో హాస్టల్ వసతి ఉన్న స్కూల్‌లో చదువుకుంది. అక్కడి నుంచి ముంబై వెళ్లాలంటే కనీసం ఐదు గంటల సమయమైనా పడుతుంది. కానీ అమ్మమ్మపై ఉన్న ప్రేమ.. ఆ దూరాన్ని లెక్క చేయనివ్వలేదు. ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకున్న ఆమె స్కూల్ మేనేజ్‌మెంట్‌కు దొరికిపోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన మా చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది.
చదవండి: జర్నలిస్టు నుంచి నిర్మాతగా.. 25 మంది తెలుగమ్మాయిలను పరిచయం చేస్తా